RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత | WPL 2025: RCB Create History Become First Team In The World To Chased 200 Runs In Women Franchise T20 Cricket | Sakshi
Sakshi News home page

RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత

Published Sat, Feb 15 2025 12:13 PM | Last Updated on Sat, Feb 15 2025 12:47 PM

WPL 2025: RCB Create History Become First Team In The World To

ఆర్సీబీ ప్రపంచ రికార్డు (PC: BCCI/WPL)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)-2025 సీజన్‌ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీ- గుజరాత్‌ జెయింట్స్‌ వుమెన్‌(Gujarat Giants Women) మధ్య మ్యాచ్‌తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.

ఆష్లే గార్డ్‌నర్‌ సునామీ ఇన్నింగ్స్‌
ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్‌(13 బంతుల్లో 25), సిమ్రన్‌ షేక్‌(5 బంతుల్లో 11) ధనాధన్‌ దంచికొట్టారు. దీంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.

అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన(9), డానియెల్‌ వ్యాట్‌- హాడ్జ్‌(4)లను సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చింది ఆష్లే గార్డ్‌నర్‌. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎలిస్‌ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్‌(25) ఆమెకు సహకారం అందించింది.

రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌
అయితే, వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ క్రీజులోకి రాగానే మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్‌ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.

ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.  మహిళల డొమెస్టిక్‌, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రిచా ఘోష్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

మహిళల డొమెస్టిక్‌ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన
1. ఆర్సీబీ వుమెన్‌- వడోదరలో 2025లో గుజరాత్‌ జెయింట్స్‌పై- 202/4(WPL)
2. ముంబై ఇండియన్స్‌- ఢిల్లీలో 2024లో గుజరాత్‌ జెయింట్స్‌పై- 191/3(WPL)
3. ఆర్సీబీ వుమెన్‌- ముంబైలో 2023లో గుజరాత్‌ జెయింట్స్‌- 189/2(WPL)
4. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌- అడిలైడ్‌లో 2024లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌పై 186/1(WBBL)
5. సదరన్‌ వైపర్స్‌- 2019లో యార్క్‌లో యార్క్‌షైర్‌ డైమండ్‌పై 185/4(WCSL).

డబ్ల్యూపీఎల్‌-2025: ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌ స్కోర్లు
👉గుజరాత్‌ జెయింట్స్‌- 201/5 (20)
👉ఆర్సీబీ వుమెన్‌- 202/4 (18.3)
👉ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్‌.

చదవండి: అద్భుత ఫామ్‌.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement