
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ఇతర దేశాల క్రీడా సంస్కృతికి భారత్‌లో జరుగుతున్న తంతుకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు.
క్రికెట్‌లో వ్యక్తి పూజపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. జట్టు కంటే ఆటగాళ్లను ఎక్కువగా ఆరాధించే అభిమానుల వైఖరిపై మండిపడ్డాడు. జట్టు ఓడిపోయినా పర్వాలేదు, తమ ఆరాధ్య ఆటగాడు రాణిస్తే చాలనుకునే మనస్తత్వాన్ని ఫ్యాన్స్ వీడాలని పిలుపునిచ్చాడు. భారత దేశంలో క్రికెటర్లు క్రికెట్ కంటే ఎత్తుకు ఎదిగిపోయారని అన్నాడు. కొందరు క్రికెటర్లు తాము ఆట కంటే గ్రేట్ అని ఫీలవ్వడానికి అభిమానుల వైఖరే కారణమని తెలిపాడు.
భారత క్రికెట్‌లో క్రికెటర్లను ఆరాధించే సంస్కృతి పోతే తప్ప టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేదని అభిప్రాయపడ్డాడు. జట్టు కంటే ఆటగాడు ఎప్పుడూ ఎక్కువ కాదని, ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానులు ఇతర దేశాల ఫ్యాన్స్‌ను చూసి నేర్చుకోవాలని అన్నాడు. భారత్‌లో లాగా ఇతర దేశాల్లో క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా ఆరాధించరని, వ్యక్తిగత భజన కంటే వారికి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ సంస్కృతి ఉంది కాబట్టే ఆ జట్లు విశ్వవేదికపై భారత్ కంటే మెరుగ్గా రాణిస్తున్నాయని అన్నాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఉద్దేశించి చేసినవిగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో భారత జట్టు నాలుగు సందర్భాల్లో ఫైనల్‌కు చేరినా నిరాశే మిగిలింది. నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలై, నాలుగో సారి ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.
444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.
ఇటు సోషల్ మీడియాలోనూ భారత్ ఓటమిని జీర్ణించుకోవట్లేదు అభిమానులు. తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్.
Indians trying to hold ICC trophy in last 10 yearspic.twitter.com/p0iK63TzK7
— Sagar (@sagarcasm) June 11, 2023
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..!