
సన్‌రైజర్స్ (PC: IPL/BCCI)
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల గురించి కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌లో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని.. జట్టు విజయాల్లో వారి పాత్ర కూడా కీలకమేనని పేర్కొన్నాడు.
కాగా గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడుతుందా అన్నట్లుగా పేలవంగా ఆడిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో మాత్రం దుమ్ములేపుతోంది. జూలు విదిల్చిన సింహంలా పరుగుల వేట మొదలుపెట్టి అద్భుత విజయాలతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్ కూడా దంచికొడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు.
ఇక లీగ్ దశలో సన్‌రైజర్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. కానీ కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది.
అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా 159 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లు కూడా తేలిపోవడంతో కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.
ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడేందుకు సన్‌రైజర్స్ సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు,
స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్ వంటి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు.
ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్లు సాధిస్తున్న కారణంగా వారి బ్యాటింగ్ లైనప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వారి బౌలింగ్ లైనప్ కూడా అంతే విధ్వంసకరంగా ఉంది.
కేవలం ఒక్క విభాగంలో రాణించినంత మాత్రాన ఐపీఎల్‌లో ఏ జట్టూ రాణించలేదు’’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌ను కూడా తక్కువ అంచనా వేయలేమని.. తమదైన రోజున ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో వాళ్లు ఎల్లప్పటికీ ప్రమాదకారులుగానే ఉంటారని గంభీర్ చెప్పుకొచ్చాడు.
కాగా గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న కేకేఆర్ ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 26 న ఫైనల్లో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య దీపిక భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment