No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, May 6 2024 1:20 AM

No Headline

ఇప్పటి వరకు

పార్టీకి చేసిన ఊడిగం చాలు.. ఇక మీతో మాకు అవసరం లేదు

దశాబ్దకాలంగా నెల్లూరు రాజకీయాల్లో లోకేశ్‌ వర్గంగా హడావుడి చేసిన మాజీ మంత్రి నారాయణ శిష్యుడు పట్టాభిరామిరెడ్డికి ఎన్నికల వేళ భంగపాటు తప్పలేదు. తన గురువుగా ఉన్న నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఉన్నా, సహాయకారిగా పనిచేసేందుకు కూడా పనికిరాడని భావించి పక్కనబెట్టారు. గత ఎన్నికల్లో నారాయణ గెలుపు బాధ్యతలను తీసుకొని అన్నీ తానై నడిపించారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభంజనంలో నారాయణ ఓటమి చెందడంతో ఆ నెపాన్ని పట్టాభిపై నెట్టేశారు. ఐదేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసి వ్యాపారాల్లో నారాయణ బిజీ అయిపోయారు. కానీ పట్టాభి మాత్రం లోకేశ్‌ వర్గంగా ఉంటూ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చుతూ ఐదేళ్లపాటు హడావుడి చేశారు. తీరా ఎన్నికల వేళ నారాయణ మరోసారి బరిలోకి దిగి పట్టాభిని పక్కనబెట్టేశారు. ఇందుకు మరో కారణమూ ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నెల్లూరు నగర టీడీపీలో ఉన్న సీనియర్‌ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఈ దఫా పట్టాభి ఉంటే తాను ఎలక్షనీరింగ్‌ చేయమని తెగేసి చెప్పారని, దీంతో ఆయన్ను నారాయణ దూరం పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో పట్టాభి ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా ఊడిగం చేసినా చివరికి వారు కరివేపాకులుగా మారుతున్నారు. తాజాగా ఆత్మకూరులో సీనియర్‌ నేతగా ఉన్న కన్నబాబుకు, నెల్లూరు నగరంలో మాజీమంత్రి నారాయణ శిష్యుడు పట్టాభికి ఎన్నికల వేళ అవమానాలు ఎదురవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వరకు పార్టీలో అన్నీ తామే అంటూ విర్రవీగిన నేతలు ప్రస్తుతం సొంత నియోజకవర్గానికే ముఖం చాటేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఓటర్లకు మీ మొహం చూపొద్దని.. ప్రక్రియలో పాల్గొనవద్దని ఆ పార్టీ అభ్యర్థులు ఖరాఖండీగా చెప్పడంతో ఈ ఇద్దరు నేతలు అవమానంగా భావించారు. ఈ తరుణంలో తమ అనుచరులకు మొహం చూపించలేని స్థితిలో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఆత్మకూరులో టీడీపీకి అభ్యర్థి కరువవ్వడంతో స్థానికంగా ఉన్న కన్నబాబే దిక్కయ్యారు. ఓటమి తప్పదని తెలిసినా, అభ్యర్థిగా రంగంలోకి దిగి నష్టపోయారు. మరోసారి 2019లో టికెట్‌ వస్తుందని భావించిన కన్నబాబుకు చుక్కెదురైంది. కాంగ్రెస్‌ తరఫున గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని కృష్ణయ్యకు టీడీపీ అవకాశం కల్పించింది. బొల్లినేని పారిశ్రామికవేత్త కావడంతో ఎన్నికల వేళ మినహా ఎప్పుడూ నియోజకవర్గంలో కనిపించరు. పార్టీ కార్యకర్తలకు ఏనాడూ చేరువకాలేదు. ఎన్నికల వేళ తప్ప దర్శనమివ్వని నేతకు టికెట్‌ ఇచ్చారు. అందరూ అనుకున్న మాదిరిగానే అయన ఓటమిపాలయ్యాక నియోజకవర్గానికి ముఖం చాటేశారు. దశాబ్దకాలం పాటు పార్టీలో అవమానాలు ఎదురైనా.. ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న కన్నబాబుకు ఈ ఎన్నికల్లోనూ మొండిచేయి చూపారు. చివరికి వైఎస్సార్సీపీ బహిష్కృత నేత ఆనానికి టికెట్‌ ఇచ్చారు. ఆత్మకూరులో ఆనం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కన్నబాబును దగ్గరికి రానివ్వలేదు. పార్టీ వ్యవహారాల్లో సైతం తలదూర్చనివ్వలేదు. లోకేశ్‌ చేపట్టిన యువగళం యాత్రకూ కన్నబాబుకు ఆహ్వానం అందలేదు. ఎన్నికల వేళ కన్నబాబును ఆనం మరింత చిన్నచూపు చూశారు. ఎన్నికల సమయంలో ఆత్మకూరులో మీ మొహం చూపొద్దని అధిష్టానం ద్వారా చెప్పించారు. దీంతో తీవ్ర అవమాన భారంతో ఆత్మకూరు వదిలి నెల్లూరు నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ వద్దకు చేరుకొని అక్కడ వ్యవహారాలు చూస్తున్నారు. తనకు జరిగిన అవమానాలను తలచుకొని తన ఆంతరంగీకుల వద్ద కన్నీరు పెట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కీలక నేతలను దూరం పెట్టిన టీడీపీ

ఆత్మకూరులో కన్నబాబును

పట్టించుకోని ఆనం

నెల్లూరులో పట్టాభిని

పక్కనబెట్టిన నారాయణ

మీ సహకారం మాకొద్దని

తేల్చిచెప్పిన అభ్యర్థులు

ఇంటికే పరిమితమైన ఈ నేతలు

పట్టాభికి భంగపాటు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement