పేద రైతు నుంచి.. ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

పేద రైతు నుంచి.. ఎమ్మెల్యే

Published Tue, May 7 2024 5:25 AM

పేద రైతు నుంచి.. ఎమ్మెల్యే

ఉదయగిరి: ఇద్దరు రాజకీయ ఉద్దండులను ఓడించి ఒక సామాన్యుడు రైతు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర దివంగత కాసిం వెంకటరెడ్డిది. ఉదయగిరి రాజకీయ ముఖ చిత్రంలో ఆనాడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాసిం వెంకటరెడ్డి నేటి తరానికి చాలా మందికి తెలియదు. వింజమూరుకు చెందిన కాసిం వెంకటరెడ్డిది సాధారణ పేద రైతు కుటుంబం. వింజమూరు తమలపాకు తోటలకు ప్రసిద్ధి. ఆ రోజుల్లోనే సుమారు 500 ఎకరాలకు పైగా తమలపాకు తోటలుండేవి. వెంకటరెడ్డి తమలపాకులను హైదరాబాద్‌, నాగపూర్‌, బొంబయిలకు ఎగుమతి చేసేవారు. తమలపాకు తోటల్లో రైతులతో సత్సంబంధాలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో అప్పట్లో ఆయన జిల్లా బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రజాసేవ చేయాలనే కాంక్షతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో దుత్తలూరు మండలం నందిపాడు నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1955లో జరిగిన ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో పోటీ చేసి విజయం సాధించిన ఘనత వెంకటరెడ్డికి దక్కింది. ఆ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులైన కోవి రామయ్య చౌదరి ఒక వైపు, ధనేంకుల నరసింహం మరో వైపు పోటీ పడ్డారు. ఇద్దరు ఉద్దండులను, బలవంతులను ఢీకొట్టి సాధారణ పేద రైతు కుటుంబానికి చెందిన వెంకటరెడ్డి విజయం సాధించడం అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో వెంకటరెడ్డి ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి పీసీపీ సభ్యుడిగా కూడా పని చేశారు. 1955 నుంచి 1962 వరకు ఏడేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో రైతులకు విరివిగా రుణాలిచ్చే నిమిత్తం భూమి తాకట్టు పెట్టే బ్యాంకులను స్థాపించి రైతులకు రుణాలు అందజేశారు. సుమారు పదిహేనేళ్ల పాటు ఆ బ్యాంకు అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 1962 ఎన్నికల సందర్భంగా నందిపాడు నియోజకవర్గాన్ని రద్దు చేసి ఆయా ప్రాంతాలను కలుపుతూ ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంగా మార్చారు.

హిస్టరీ

Advertisement
 
Advertisement