విప్ భయం.. పదవీ గండం
కొంప ముంచే చేతులెత్తే విధానం
నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పార్టీ ఫిరాయింపుదారులకు ఎన్నికల భయం పట్టుకుంది. రాజకీయ పార్టీ లు జారీ చేసిన విప్‌ను ధిక్కరిస్తే పదవులు కోల్పోయే అవకాశం ఉండడంతో కార్పొరేటర్లతోపాటు కౌన్సిలర్లలో ఆందోళన మొదలైంది. కూటమి ప్రభుత్వం రావడంతో కొందరు రాజకీయ ప్రయోజనాలు ఆశించి.. మరి కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పచ్చకండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారిని విప్ భయం
వెంటాడుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ సింబల్‌పై గెలిచి.. అధికార దాహంతో నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కూడా ఈ విషయంలో చట్టప్రకారం వ్యూహాన్ని అనుసరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 3న నెల్లూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో వైస్ చైర్మన్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విప్ జారీ చేస్తే..
నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాళెంలో జరిగే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ ధిక్కరించి భిన్నంగా ఓటేసినా, ఎన్నికలకు గైర్హాజరైనా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఉంది. పార్టీ విప్‌ను ఉల్లంఘింస్తే తప్పక అనర్హత వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. 1980లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పదో షెడ్యూల్లో చేర్చారు. 2003లో పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరణలోకి తీసుకువచ్చారు. విప్ ఉల్లంఘనులపై వైఎస్సార్‌సీపీ న్యాయస్థానం ద్వారా అనర్హత వేటు వేయించేందుకు ఆ పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్‌లో..
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. అప్పట్లో అన్ని డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందడంతో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో అప్పటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో కొందరు ఆయన వెంట వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరికొందరు కార్పొరేటర్లు వారి రాజకీయ అవసరాలు, స్థానిక ఎమ్మెల్యేల బెదిరింపుల పర్వంతో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటికే దాదాపు 40 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ పదవులు ఉండగా, అందులో ఒకటి రూప్‌కుమార్ యాదవ్‌కు కేటాయించగా ఆయన కొనసాగుతున్నారు. రెండో డిప్యూటీ మేయర్‌గా ఖలీల్ అహ్మద్‌ను నియమించారు. అయితే ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగర వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సి రావడంతో డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ క్రమంలో ఆ పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు.
బుచ్చిరెడ్డిపాళెంలో..
బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం రెండు వార్డుల్లో మాత్రమే టీడీపీ సభ్యులు గెలిచారు. అప్పట్లో బుచ్చిరెడ్డిపాళెం చైర్‌పర్సన్ ఎన్నిక పూర్తి చేశారు. కానీ రెండు వైస్ చైర్మన్ల ఎన్నిక మాత్రం జరగలేదు. ఈక్రమంలో కూటమి ప్రభుత్వం రావడంతో వైఎస్సార్‌సీపీ నుంచి 9 మంది కౌన్సిలర్లను రాజకీయ, ఆర్థిక అవసరాలతో ముడిపెట్టి టీడీపీలోకి చేర్చుకున్నారు. ఆ రెండు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో టీడీపీ నేతలు కౌన్సిలర్లతో క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. అయితే విప్‌జారీ ప్రక్రియ తెరపైకి రావడంతో కౌన్సిలర్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు.
డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి సభ్యులు చేతులెత్తే విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో అయితే వీడియో రికార్డెడ్ ఆధారంగా పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎన్నిక ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ తప్పక వీడియో రికార్డింగ్ చేయిస్తుంది. సభ్యుల పేర్లతో సహా ఎవరు ఏ పార్టీ అభ్యర్థికి చేయి ఎత్తారనేది ప్రతిదీ రికార్డింగ్ అవుతుంది. ఈ క్రమంలో విప్ ధిక్కరిస్తే తప్పక అనర్హత వేటు పడి పదవులు కోల్పోయే అవకాశం ఉండడంతో ఫిరాయింపుదారుల్లో ఆందోళన నెలకొంది.
వచ్చే నెల 3న డిప్యూటీ మేయర్,
వైస్ చైర్మన్ల ఎన్నిక
ఆయా పదవులకు వైఎస్సార్‌సీపీ
నుంచి ఎన్నికల బరిలో అభ్యర్థులు
నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ సింబల్‌పై గెలిచిన 54 మంది
కార్పొరేటర్లు
బుచ్చిలో 20 మంది కౌన్సిలర్లలో
18 మంది వైఎస్సార్‌సీపీ వారే
కూటమి ప్రభుత్వం రాకతో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు
పార్టీ ఫిరాయింపుదారుల గుండెల్లో రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment