
అటవీ పనుల వేతనాల పెంపు
● జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారుల సమావేశంలో నిర్ణయం
నెల్లూరు(అర్బన్): అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల పనులకు ఈ ఏడాది 4.36 శాతాన్ని అదనంగా పెంచి వేతనాలివ్వాలని కమిటీ నిర్ణయించిందని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, గుంటూరు కాశీవిశ్వనాథరాజు పేర్కొన్నారు. వేతనాల పెంపుపై జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని వేదాయపాళెంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారె్‌స్ట్స్ ఆఫ్ షెడ్యూల్ రేట్స్ కమిటీ చైర్మన్ కాశీవిశ్వనాథరాజు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డీజిల్ ధర తగ్గిందని, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగనున్న పనులకు 4.36 శాతం అదనంగా వేతనాలను ఇవ్వనున్నామన్నారు. అడవుల్లో చేపట్టే జంగిల్ క్లియరెన్స్, మొక్కలు నాటడం, కాపలా ఉండే వారికి, ట్రెంచ్‌లను ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లు, రవాణా.. ఇలా అన్ని రకాల వాటికి ఇది వర్తించనుందని వెల్లడించారు. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ఏర్పాటు చేయాల్సిన నీటి వనరులపై చర్చించారు. డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా, అనంతపురం డీఎఫ్‌ఓ, కర్నూలు ఎఫ్‌ఏసీ డీఎఫ్‌ఓ యశోదబాయి, నంద్యాల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ నుంచి కృష్ణమూర్తి, తిరుపతి అధికారి సెల్వం, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్, బయోట్రిమ్ తిరుపతి అధికారి నరేంద్రన్, ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, తిరుపతి సోషల్ ఫారెస్ట్ ఆఫీసర్‌ఽ ధర్మరాజు, నెల్లూరు సోషల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగార్జునరెడ్డి, సూళ్లూరుపేట వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి హారిక తదితరులు పాల్గొన్నారు.