
షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం టీడీపీనే..
● వైఎస్సార్‌సీపీ నేతలు
కోవూరు: ‘కోవూరు చక్కెర కర్మాగారం మూసివేతకు కారణం టీడీపీ అనే విషయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలి. దీనిపై అసెంబ్లీలో అసత్యాలు చెప్పడం దారుణం’ అని డీఏఏబీ మాజీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి అన్నారు. కోవూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలిసి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరారన్నారు. దాని స్థితిగతులు తెలుసుకోవాలని నిపుణులతో కూడిన బృందాన్ని జగన్ పంపారన్నారు. వారు పరిశీలించి ఈ కర్మాగారం తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేదని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారన్నారు. 2013 వరకు ఉద్యోగులు, కార్మికులకు ఉన్న బకాయిలను అప్పటి ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2014 – 19 వరకు టీడీపీ హయాంలో బకాయిలు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విషయాన్ని ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలన్నారు. ఆ మొత్తం రూ.20 కోట్లని అసెంబ్లీ సాక్షిగా ఆమె చెప్పారని, కానీ ప్రస్తుతం రూ.22.30 కోట్లకు చేరుకుందన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలుమార్లు కార్మికుల బకాయిల గురించి లేఖలు రాశారన్నారు. కొన్ని ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని తెలిపారు. కోవూరు ఫ్యాక్టరీ విషయానికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడంతో బకాయిల చెల్లింపు ఆగిందన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని చూస్తారే తప్ప కమీషన్ల కోసం ఎదురు చూడరని తెలుసుకోకుండా అసెంబ్లీలో అసత్యాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు అనూప్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల పక్షాన ప్రసన్నకుమార్‌రెడ్డి పోరాటం చేశారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, కవరగిరి ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.