
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం
ఆత్మకూరు రూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం, రైతులకు చేయూతనందించడంలో విఫలమైందని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన రైతు సంఘ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకుపైగా వరి సాగైతే, 3.57 లక్షల ఎకరాలకే ఈ – క్రాప్‌ను నమోదు చేశారని ఆరోపించారు. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రకటించినా, చాలా చోట్ల గోతాలను సైతం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా అభివర్ణించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పటి వరకు కేవలం 50 వేల పుట్ల ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారని చెప్పారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ మొత్తాన్ని ఇస్తుండటంతో, పది శాతం మంది రైతులే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి మొగ్గుచూపుతున్నారని చెప్పారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మూలె వెంగయ్య, సహాయ కార్యదర్శులు శ్రీనివాసులు, జనార్దన్, ఉపాధ్యక్షుడు లక్కు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ సబ్సిడీ జమను
పరిశీలించండి
నెల్లూరు రూరల్: దీపం – 2 స్కీమ్ కింద లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం జమైందో లేదో పరిశీలించుకోవాలని జేసీ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోర్టల్‌ను ఓపెన్ చేసి లబ్ధిదారుల 17 అంకెల ఎల్పీజీ గ్యాస్ ఐడీ లేదా రేషన్‌కార్డు నంబర్‌ను నమోదు చేస్తే ఓటీపీ వస్తుందని, దీన్ని ఎంటర్ చేయడం ద్వారా సబ్సిడీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చన్నారు.