
582 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 582 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 682 బేళ్లు రాగా వాటిలో 582 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 76,911 కిలోల పొగాకును విక్రయించగా రూ.2,06,92,754 వ్యాపారం జరిగింది. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280 కాగా కనిష్ట ధర రూ.235 లభించింది.
అకాల వర్షం..
అన్నదాతకు కష్టం
ఆత్మకూరు రూరల్: మండలంలోని ఆరవేడులో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టుకొని ఉన్న వరి ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్థానిక సర్పంచ్ సూరం ప్రసాద్‌రెడ్డికి చెందిన 35 పుట్ల ధాన్యం తడిచిపోగా, మరికొందరు రైతులకు చెందిన మరో పది పుట్లకుపైగా ధాన్యం తడిచి పోయింది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయిద్దామని అధికారుల చుట్టూ తిరుగుతున్నా రోజుల తరబడి పట్టించుకోకపోవడం వల్లే తాము నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
అర్థమయ్యే రీతిలో
బోధించాలి
కందుకూరు రూరల్: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. కందుకూరు పట్టణంలోని అమలనాధునివారిపాలెం ప్రాథమిక పాఠశాలను సబ్ కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చదువు ఎలా సాగుతుందో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. పాఠశాలలోని 20 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ అనూషకు సూచించారు. ఆమె వెంట కందుకూరు ఎంఈఓ సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులు ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ కారుణ్య నియామకాల కింద ఇద్దరిని ఆఫీసు సబార్డినేటర్లుగా శుక్రవారం నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, ఉద్యోగ సంఘ నాయకులు పెంచలయ్య, భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

582 పొగాకు బేళ్ల విక్రయం

582 పొగాకు బేళ్ల విక్రయం