
చేతికొచ్చిన పంట సర్వనాశనం
●బీపీసీఎల్ సిబ్బంది, కాంట్రాక్టర్ల నిర్వాకం
కావలి: కావలి మండలంలోని సర్వాయపాళెం, అల్లిగుంటపాళెంలో 20 రోజుల్లో వరికోతకు సిద్ధంగా ఉన్న పంటను శనివారం బీపీసీఎల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు జేసీబీలతో తొక్కించి నాశనం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వారు దౌర్జన్యంగా తొక్కించేయడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. పంటను ధ్వంసం చేస్తున్న యంత్రాలను అడ్డుకుని నిరసన తెలిపారు. కృష్ణపట్నం నుంచి హైదరాబాద్‌కు బీపీసీఎల్ పైపులైన్ల పనులు చేపట్టింది. ఇందులో భాగంగా సర్వాయపాళెం, అల్లిగుంటపాళెం రైతులకు చెందిన భూముల్లో పైపులైన్లు వేయాల్సి ఉంది. పరిహారం చెల్లించకుండా ఆ సంస్థ సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తుండటం, రైతులకు కనీస మర్యాద ఇవ్వకపోవడంతో ఇటీవల ధర్నా కూడా నిర్వహించారు. పరిహారం చెల్లించకుండా భూముల్లో అడుగుపెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. దీంతో బీపీసీఎల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు శనివారం మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా జేసీబీలతో కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో పనులు మొదలుపెట్టారు. చాలామంది రైతుల పంట కళ్ల ముందే నాశనమైపోయింది. నాశనం చేసిన పంటకు కూడా పరిహారం చెల్లించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.

చేతికొచ్చిన పంట సర్వనాశనం