నదిలోకి రాచబాట | - | Sakshi
Sakshi News home page

నదిలోకి రాచబాట

Published Sun, Apr 6 2025 12:13 AM | Last Updated on Sun, Apr 6 2025 12:13 AM

నదిలో

నదిలోకి రాచబాట

● పెన్నాను తోడేస్తున్న పచ్చ తోడేళ్లు

వెంకటగిరిలో ప్రజాప్రతినిధి అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

రాజుపాళెం, తెలుగురాయపురంలో అక్రమ రీచ్‌లు

నిత్యం 3,200 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఇతర రాష్ట్రాలకు..

పెన్నానదిలోకి నేరుగా రాచబాటలు వేసిన ఇసుకాసురులు

పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా పట్టించుకోని అధికారులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక తోడేళ్లు రెచ్చిపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతో షోడో ఎమ్మెల్యే కనుసన్నల్లో పచ్చ మాఫియా అధికారంలోకి వచ్చిన పది నెలల్లో కోట్లకు పడగలెత్తారంటే.. ఏ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో అర్థమవుతోంది. కలువాయి మండలం రాజుపాళెం, తెలుగురాయపురం సమీపంలోని పెన్నానదిని పచ్చ నేతలు కుళ్లబొడిచేస్తున్నారు. వాస్తవానికి పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతి ఉండాలి. కానీ ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఎన్‌జీటీ అను మతి ఇవ్వలేదు. పది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ్ముళ్లు ఇసుక రేవుల్లో పడి దోచేస్తున్నారు.

యూనిట్‌కు రూ.వెయ్యి వాటా

రాజుపాళెం, తెలుగురాయపురం ఇసుక రేవుల నుంచి ఇసుక తరలించాలంటే నియోజకవర్గ ప్రజాప్రతినిధికి యూనిట్‌కు రూ.వెయ్యి వాటా ముట్టజెప్పాల్సి ఉంది. ఆ ప్రజాప్రతినిధి తెలుగురాయపురం, అనంతసాగరం మండలానికి చెందిన వారికి రాజుపాళెంలో రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చేశాడు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నాయకుడి కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి నిత్యం సగటున వంద వాహనాల్లో ఇసుక తరలిపోతున్నట్లు సమాచారం. ప్రతి వాహనానికి 8 యూనిట్లు లెక్కన నిత్యం 800 యూనిట్ల ఇసుకను ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అండతో ఇసుక మాఫియా బరితెగించి రేయింబవళ్లు తవ్వకాలు చేస్తోంది. పగలు, రాత్రి వాహనాల రణగొణ ధ్వనులతో ఆయా మార్గంలోని నివాసాల్లో ఉంటున్న వారికి నిద్ర, ప్రశాంతత కరువైంది. ఇళ్లు, రోడ్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. రహదారులు సైతం చిధ్రమవుతున్నాయి. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ఈ అక్రమార్జనలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలుగురాయపురం రీచ్‌లో యంత్రాలతో ఇసుక లోడింగ్‌

పెన్నానదిలో ఇసుక రేవుల్లో పచ్చ దొంగలు పడ్డారు. ప్రభుత్వ, పర్యావరణ అనుమతులు లేకుండానే నదిలో అక్రమంగా ఇసుక తవ్వేసి జేబులు నింపుకొంటున్నారు. పచ్చ నేతల దోపిడీకి అధికార యంత్రాంగం సాగిలపడుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ రేయింబవళ్లు లారీలు, టిప్పర్లు వరుసపెట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా.. అధికార యంత్రాంగం సైతం అవినీతిలో భాగస్వాములై అసలు ఇసుక రవాణే జరగడం లేదంటూ నిస్సిగ్గుగా బుకాయిస్తోంది.

పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి రాచబాట వేశారు. తెలుగురాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్డు వేశారు. రాజుపాళెంలోకి ప్రధాన రహదారి నుంచి ప్రైవేట్‌ వ్యక్తికి చెందిన మామిడి తోట నుంచి రోడ్డును నిర్మించారు. ఆ రహదారి వేసినందుకు ప్రైవేట్‌ వ్యక్తికి నెలకు రూ.50 వేలు ఇస్తున్నారు. నదీ గర్భంలోకి రోడ్డు వేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల పత్రికల్లో కథనాలు రావడంతో రహదారిని మూసివేసినట్లుగా హడావుడిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నట్లు ఫొటోలు తీసి ప్రచారం చేశారు. గంటల వ్యవధిలోనే ఆ ఫ్లెక్సీలు చించేసి యథావిధిగా రహదారి నుంచి వాహనాల రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టారు. అధికార పార్టీ నేతల సహకారంతో ఇసుక మాఫియా నదీలో ఇసుక దోపిడీ చేస్తుంటే అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై కలువాయి తహసీల్దార్‌ శ్యామ్‌సుందర్‌ను సాక్షి ప్రశ్నించగా పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణా విషయం మాకు తెలియదు. ఇసుక రవాణా జరుగుతుంటే మీరే మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు.

నదిలోకి రాచబాట 
1
1/2

నదిలోకి రాచబాట

నదిలోకి రాచబాట 
2
2/2

నదిలోకి రాచబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement