
ఆరోగ్యమే మహాభాగ్యం
నెల్లూరు(అర్బన్): మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో జిల్లాలో వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. బీపీ, షుగర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కేన్సర్, క్షయ లాంటి జబ్బుల బారిన పడే వారి సంఖ్య అధిక సంఖ్యలో ఉంది. ప్రజలు తమ ఆదాయంలో అధిక శాతం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఖర్చు చేసి అప్పులపాలవుతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి విషయాలని 1950లోనే పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం బాగుంటుందని పేర్కొంది. అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్నిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపనకు గుర్తుగా ప్రతి ఏడాది ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరపాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. సోమవారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సదస్సులు నిర్వహించబోతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 450 రిజిస్ట్రేషన్ కలిగిన హాస్పిటళ్లున్నాయి. అనధికారికంగా మరో 300 వరకు క్లినిక్‌లు నడుపుతున్నారు. హోల్‌సేల్, రిటైల్ కలిపి సుమారు 2 వేల మెడికల్ షాపులున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 52 పీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, 2 ఏరియా ఆస్పత్రులు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, నెల్లూరు నగరంలో ఒక బోధనాస్పత్రి (జీజీహెచ్) ఉన్నాయి. ఇవేకాక ఆయుర్వేద హాస్పిటళ్లున్నాయి. వీటిల్లో సుమారు 2,500 మంది వరకు డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు.
పెరుగుతున్న రోగులు
జిల్లాలో సుమారు 27 లక్షల మంది జనాభా ఉన్నారు. 15 వేల మంది కేన్సర్ రోగులున్నట్లు అంచనా. 5.50 లక్షల మంది బీపీ, షుగర్ రోగులున్నారు. కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడే వారు 6 వేల మంది వరకూ ఉన్నారు. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లోనే 4,055 మందికి టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బయట ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న రోగులు మరికొంత ఉంటారు. అలాగే పెద్ద సంఖ్యలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. వీరు మంచానికి పరిమితమవుతున్నారు. ఇంకా పలురకాల జబ్బుల బారిన పడుతున్నారు.
ఇవి తింటే..
సీజనల్‌గా లభించే తాజా పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు భోజనంలో భాగం కావాలి. కలుషితం లేని రక్షిత నీటిని ఎక్కువగా తాగాలి. గింజలు (వేరుశనగ, పెసలు, శనగలు, ఉలవలు) లాంటి వాటిని రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతి మనిషి ఏడు గంటలు నిద్ర పోవాలి. సాయంత్రం భోజనం 7 నుంచి 8 గంటల్లోపే ముగించాలి. పని ఒత్తిడి తగ్గించుకోవాలి. తగిన వ్యాయామం చేయాలి. కంప్యూటర్, ఫోన్ లాంటి స్క్రీన్లకు అతుక్కుపోరాదు. పాలి ష్డ్ బియ్యం బదులు ముడిబియ్యం ఆరోగ్యానికి మంచిది. కల్తీ లేకుండా ఉండేందుకు నువ్వుల నూనె, వేరుశనగ లాంటి నూనెలు స్వయంగా మిల్లు వద్దకు వెళ్లి ఆడించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రిఫైన్డ్ ఆయిల్‌కు దూరంగా ఉండటం శ్రేష్టం. పొగాకు, మద్యం జోలికెళ్లరాదు. తద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ప్రజల ఆరోగ్యం.. ప్రజల చేతుల్లోనే అనే నినాదాన్ని నిజం చేయొచ్చు.
మారిన జీవనశైలితోనే ఆరోగ్య సమస్యలు
పెరుగుతున్న బీపీ, షుగర్ జబ్బులు,
గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు
అందని ద్రాక్షగా మారిన అందరికీ ఆరోగ్యం
సంపాదనలో వైద్యానికి అధికంగా ఖర్చు
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం