సంకటహర.. సాయిగోపాలా
ప్రశాంతి నిలయం: సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాలు సోమవారం అంతర్జాతీయ అధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహా సమాధిని సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
వేదపఠనంతో వేడుకలు ప్రారంభం
సాయికుల్వంత్ సభా మందిరంలో ఉదయం 8 గంటలకు వేదపఠనంతో సత్యసాయి జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితులు పూజల అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన 2,700 మంది వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు సత్యనారాయణ రాజుగా పిలవబడే సత్యసాయి బాబా అవతార వైభవాన్ని, ఆయన లీలామృతాన్ని వివరించారు.
పురవీధుల్లో ఊరేగిన వేణుగోపాలుడు
సాయికుల్వంత్ సభా మందిరంలోని మూలవిరాట్టు వేణుగోపాల స్వామికి, ఉత్సవ మూర్తులైన సీతారామ, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ పండితులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి వేణుగోపాలుడిని రథంలో కొలువుదీర్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు నాగానంద, పలువురు ట్రస్ట్ సభ్యులు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందు ఉత్సవ మూర్తులు, ఆ వెనుకే మూలవిరాట్టు వేణుగోపాలస్వామి రథంపై పుట్టపర్తి పురవీధులలో ఊరేగారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు సాయిగోపాలుని నామాన్ని స్మరిస్తూ ముందుకుసాగారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రముఖులు, భక్తులు, స్థానికులు రథాన్ని లాగారు. పట్టణ ప్రజలు నారికేళాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్వేత వస్త్ర ధారులైన సత్యసాయి విద్యాసంస్థల చిన్నారులు సాయిగోపాలుని నామాన్ని స్మరిస్తూ రథోత్సవంలో ముందు నడిచారు. రథోత్సవంలో సత్యసాయి బాలవికాస్ చిన్నారులు నెమలి నాట్యం, మహిళల కోలాటం, కళాకారుల గరగ నృత్యం అందరినీ అలరించారు. పలువురు చిన్నారులు పురాణేతిహాసాలను చాటుతూ సీతారామలక్ష్మణ, భరత శతృజ్ఞుల వేషధారణలో ఆకట్టుకున్నారు. పెదవెంకమరాజు కల్యాణ మండపం వద్ద ఆర్‌జె.రత్నాకర్ రాజు దంపతులు హారతి ఇచ్చి వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని ముగించారు. కార్యక్రమంలో ఎస్పీ వి.రత్న, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్, సత్యసాయి సేవా సంస్థల కోఆర్డినేటర్లు చలం, లక్ష్మణరావు పాల్గొన్నారు.
8 రోజుల పాటు మెడికల్ క్యాంప్
సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెడికల్ క్యాంప్‌ను సోమవారం ఆర్‌జె.రత్నాకర్ రాజు ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన వివిధ విభాగాల స్పెషలిస్టు వైద్యులు 8 రోజుల పాటు సేవలు అందించనున్నట్లు సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ప్రారంభమైన సత్యసాయి 99వ జయంత్యుత్సవాలు
భక్తి శ్రద్ధలతో సాగిన సామూహిక
సత్యసాయి వ్రతాలు
సాయి గోపాలుని స్మరణతో
మార్మోగిన పుట్టపర్తి
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన కళాకారులు
వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. కళాకారుల ఆటపాటలు.. భక్తుల
నీరాజనాలు..ఎవరినోట విన్నా
సాయిగోపాలుడి నామస్మరణే.. ఎవరిని కదిపినా ‘సాయిరాం’ అంటూ ప్రేమతో కూడిన పలకరింపులే. సత్యసాయి
99వ జయంత్యుత్సవాల ప్రారంభం
సందర్భంగా సోమవారం కనిపించిన
దృశ్యమిది. ఉదయం నిర్వహించిన
వేణుగోపాల రథోత్సవం... రమణీయంగా సాగింది. భక్తకోటి సంకటహర..
సాయిగోపాలా అంటూ కీర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment