భక్త కనకదాస జీవితం నేటి తరాలకు ఆదర్శం ●
●జయంతి వేడుకల్లో కలెక్టర్ చేతన్
పుట్టపర్తి టౌన్: మహాకవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త భక్త కనకదాస జీవితం నేటి తరాలకు ఆదర్శమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పుట్టపర్తి సాయిఆరామంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చేతన్ ముఖ్య అతిథిగా హాజరై భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు కోసం కృషి చేసిన మహనీయుడు కనకదాస అన్నారు. ఆయన జీవిత చరిత్ర చూస్తే విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనేది కనకదాస ఆశయమన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి చైతన్య పర్చిన గొప్ప మానవతావాదిగా అభివర్ణించారు. కనకదాస ఆనాడే ఉన్నత చదవులు చదవి సమాజాన్ని అన్ని కోణాల్లో అధ్యయనం చేశారన్నారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని, అందుకే ప్రభుత్వం భక్త కనకదాస జయంతిని అధికారికంగా జరుపుతోందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, నాయకులు మల్లికార్జున, చెన్నప్ప, రమేష్, జగదీష్‌తో పాటు పలువురు కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు
బాలికలు ప్రపంచాన్నే మార్చగలరు
●కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: ప్రోత్సాహం అందిస్తే బాలికలు అద్భుతాలు చేయగలరని, ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతులుగా ఎదుగుతారని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కిశోర బాలికల వికాసానికి సంబంధించిన శిక్షణ వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కిశోరి వికాసం శిక్షణలో విద్య ప్రాముఖ్యత, ఆరోగ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టం, సెల్ప్ డిఫెన్స్, యోగా, లైఫ్ స్కిల్స్ తదితర వాటిపై మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామని, వారు మహిళా పోలీస్, వార్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ, ఏఎన్‌ఎం, అంగన్‌డీ వర్కర్లకు శిక్షణ ఇస్తారన్నారు. ఇలా శిక్షణ పొందిన వారు కళాశాలలు, పాఠశాలల్లోని 11 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలకు అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment