మహిళను మోసం చేసి రూ.20 వేలు విత్‌డ్రా
ధర్మవరం: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో సోమవారం ఓ మహిళను దుండగుడు మోసగించి రూ.20వేలు నగదు విత్‌డ్రా చేసుకున్నాడు. తొలుత ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వచ్చిన మహిళను మాటలతో ఏమార్చి ఆమె వెళ్లిపోయిన తర్వాత నగదు అపహరించినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
కవితోత్సవానికి
పేర్లు నమోదు చేసుకోండి
పెనుకొండ: ధర్మవరం వేదికగా డిసెంబర్ 1న ఉదయం పది గంటలకు జరిగే కవితోత్సవానికి పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్‌బాషా సోమవారం పిలుపునిచ్చారు. ధర్మవరం నియోజకవర్గ రచయితల సంఘం అధ్యక్షుడు జయసింహ, ప్రధాన కార్యదర్శి సత్యనిర్థారణ్ తదితరుల నేతృత్వంలో జరిగే ఈ కవితోత్సవంలో చేనేత కష్టాలపై, వృద్ధాప్య జీవన అంశంపై 20 లైన్లకు మించకుండా కవితలు, పాటలు రాసి వినిపించవచ్చునన్నారు. ఆసక్తి ఉన్న వారు 94409 29894, 94940 18465లో సంప్రదించాలని సూచించారు.
జూదరుల అరెస్ట్
గోరంట్ల: మండలంలోని వెంకటరమణపల్లి సమీపంలో సోమవారం పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. వారి నుంచి రూ. 1,29,160 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
శ్మశాన వాటికలో
గుర్తు తెలియని మృతదేహం
సోమందేపల్లి: మండల కేంద్రంలోని జామీయ మసీదు రహదారి పక్కనే ఉన్న శ్మశాన వాటికలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. వేర్వేరుగా పడి ఉన్న మృతుడి శరీర భాగాలను కుక్కలు పీక్కుతిన్నాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
క్రీడలతో మానసికోల్లాసం
బుక్కరాయసముద్రం: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌లో 3వ క్రీడా మహోత్సవ్–2024 ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ప్రభుకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు రోజూ యోగా, వ్యాయామం చేయాలన్నారు. ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడలు మనస్సుకు ఉత్తేజాన్నిస్తాయన్నారు. బెటాలియన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, పోలీసు సిబ్బంది సహకరించాలన్నారు. సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాలుగు ఆయుర్వేదిక్ కేంద్రాల మూసివేత
అనంతపురం: నగరంలో ఉన్న ఆయుర్వేదిక్ మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ ఎం. నాగభూషణం, సీఐ కే. శ్రీనివాసులు, ఏఓ జే. వాసు ప్రకాష్, అసిస్టెంట్ డైరెక్టర్ (డ్రగ్స్) రమేష్ రెడ్డి దాడుల్లో పాల్గొన్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న కమలా నగర్‌లోని మెహతా ఆయుర్వేద కేంద్రం, రామచంద్ర నగర్ మెయిన్ రోడ్‌లోని సుశ్రత ఆయుర్వేద హాస్పిటల్, అరవింద నగర్‌లోని కేరళ ఆయుర్వేదం, సాయి నగర్‌లోని ధన్వంతరి మల్టీ స్పెషాలిటీ అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌ను మూసివేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నివేదిక పంపినట్లు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. మొత్తం 6 ఆయుర్వేదిక్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, నాలుగు షాపులను మూసివేసినట్లు పేర్కొన్నారు.
నర్స్ అదృశ్యం
అనంతపురం: నగరంలోని ఆనంద్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న జి.మేఘన (24) అదృశ్యమైనట్లు త్రీ టౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. మేఘన భర్త జి.హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం తిప్పేపల్లి గ్రామానికి చెందిన జి.నరసింహులు కుమారుడు జి.హరి అనంతపురం నగరంలోని షిరిడీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. హరి వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో విధులకు వెళ్లారు. మేఘన ఇటీవలే ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయ్యారు. ఆదివారం ఆరోగ్యం సరిగా లేదని ఇంటికి వెళ్తున్నట్లు తోటి సిబ్బందికి చెప్పి వెళ్లిన మేఘన.. ఇంటికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment