అనంతపురం సెంట్రల్: గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై రవాణాశాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆర్టీఏ అధికారులు ఇప్పటికే నివేదికను కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. ఆటోట్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. గార్లదిన్నె మండల కేంద్రంలోకి రాకపోకలు సాగించే వాహనాలు, తలగాచిపల్లి, తిమ్మంపేట గ్రామాలకు వెళ్లే వాహనాలకు అనువుగా అక్కడ జంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో అతివేగంగా వాహనాలు వెళ్లకుండా స్పీడ్‌బ్రేకర్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రమాదం జరగడం చూస్తే ఇందుకు ప్రధాన కారణం కూడలి ప్రాంతంలో ఓవర్‌టెక్ చేయడమేనని తెలిసింది. దీనికి తోడు జంక్షన్ ప్రాంతంలో లారీని కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేసినట్లు సమాచారం. ఓవర్‌టేక్ చేయకపోయినా, స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు వేగం తగ్గినా కూలీలు సురక్షితంగా బయటపడేవారు. కాగా, గతంలో జేఎన్‌టియూ వీసీ సైతం ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గమనార్హం. ఈ రహదారిలో ప్రమాదం జరిగిందంటే గాయాలతో బయటపడే పరిస్థితి లేదు.
దిద్దుబాటు చర్యలు..
తలగాచిపల్లి క్రాస్ వద్ద ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దిద్దుబాటు చర్యలకు పోలీసు, రవాణాశాఖ యంత్రాంగం ఉపక్రమించింది. పరిమితికి మించి వాహనదారులను తరలిస్తున్న ఆటోలను ఎక్కడికక్కడ సీజ్ చేసి పోలీసుస్టేషన్‌లకు తరలిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టం జరిగి తర్వాత అధికారులు రోడ్లపైకి వస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment