లింగ వివక్షపై పోరాడదాం
ప్రశాంత నిలయం: లింగ వివక్షకు వ్యతిరేకంగా అందరం సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జెండర్ అధారిత హింస వ్యతిరేక పోరాటంపై రూపొందించిన ప్రచార వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో లింగ వివక్షపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన జాతీయ ప్రచార కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలతో పాటు ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవంపై
విస్తృత ప్రచారం
రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్ అధికారుల చురగ్గా పాల్గొని సంవిధాన్ దివస్(రాజ్యాంగ దినోత్సవం) గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రచార కార్యక్రమాల్లో రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, సూత్రాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలన్నారు. క్విజ్ కార్యక్రమాలు ద్వారా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎంఎస్‌ఎంఈ సర్వే పక్కాగా చేయాలి..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తున్నామని, సంబంధిత శాఖ ఉద్యోగులు పరిశ్రమల వివరాలను పక్కాగా యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ సర్వే ప్రయోజనాలు, వ్యాపార, సేవా కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రచార కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించిన సాధారణ వ్యాపార సంస్థలనూ సర్వే చేయాలన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment