పట్టించుకోక..
పెనుకొండ: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ గ్రామగ్రామానా సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రజలకు ముంగిళ్లలోనే సేవలందించేందుకు ఆయా కార్యాలయాలకు సొంత భవన నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేసింది. ఫలితంగా ఉద్యోగులకు సౌకర్యాలు సమకూరి సేవలు వేగవంతమవుతాయని భావించింది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం...కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భవన నిర్మాణాల పనులు ముందుకు సాగడం లేదు. కూటమి ప్రభుత్వం ఈ భవన నిర్మాణాలను పూర్తిగా విస్మరించడంతో భవనాలన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి.
అందని సేవలు.. ఇబ్బందుల్లో ఉద్యోగులు
గత వైఎస్ జగన్ సర్కార్ జిల్లాలో 1,102 సచివాలయ, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిధులూ మంజూరు చేసింది. కానీ అధికారుల పర్యవేక్షణ కరువు కావడంతో భవన నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. చేసిన పనుల వరకూ బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్లు ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ పనులు వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం మారడంతో బిల్లులు అవుతాయోలేదోనన్న సందేహంతో చాలా మంది భవన నిర్మాణాలు నిలిపివేశారు. దీంతో ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేని అద్దె భవనాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని అద్దె భవనాలకు కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలకు అందని సేవలు..
వైఎస్ జగన్ హయాంలో గ్రామీణులకు పూర్తిస్థాయిలో సేవలందించిన సచివాలయాలు, అర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఇప్పుడు ఉనికి కోల్పోతున్నాయి. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందించే సేవలను తగ్గించడం, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలనూ నామమాత్రంగా నిర్వహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగులు, సేవల కోసం వచ్చే ప్రజలతో కళకళాడిన కార్యాలయాలన్నీ నేడు వెలవెలబోతున్నాయి. ఇక ఎవరైనా బదిలీపై వెళ్తే సదరు ఉద్యోగి స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ప్రజలు అటువైపు వెళ్లడం మానేశారు. ప్రస్తుతం ఏ సర్టిఫికెట్ కావాలన్నా వ్యయప్రయాసలకోర్చి మండల కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
నిరుపయోగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు..
సచివాలయ భవనాలకు అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఇంజినీరింగ్, మండల పరిషత్ అధికారులకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. అరకొర పనులు చేసిన కాంట్రాక్టర్లు అనంతరం భవన నిర్మాణాల గురించి పట్టించుకోలేదు. ఫలితంగా ప్రజలకు సేవలు సకాలంలో అందని పరిస్థితి నెలకొంది.
అర్ధంతరంగా ఆగిన
ప్రభుత్వ భవన నిర్మాణాలు
అసంపూర్తిగా సచివాలయ,
ఆర్బీకే, విలేజ్ క్లినిక్ భవనాలు
1,102 భవనాలు మంజూరు కాగా,
453 మాత్రమే పూర్తి
నేటికీ అసంపూర్తిగా 649 భవనాలు
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులున్నా..
పట్టించుకోని అధికారులు
ప్రజలకు సకాలంలో అందని సేవలు
ఇది పెనుకొండ అర్బన్ కాలనీలోని సచివాలయ భవనం. ఈ భవన నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. అయితే అరకొర బిల్లులు అందుకున్న కాంట్రాక్టర్..ఆ తర్వాత పనులు నిలిపివేశాడు. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో భవన నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
...ఇలా ఒకటి కాదు, రెండు కాదు జిల్లాలోని 649 ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రజలకు సేవలందడం లేదు. మరోవైపు సౌకర్యాలు లేని భవనాల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది పెనుకొండ అర్బన్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్. ఈ భవనానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.20.80 లక్షలు మంజూరయ్యాయి. కానీ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం... కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెరసి హెల్త్ సెంటర్ విష సర్పాలకు నిలయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment