రాత్రి కరెంటుపై రగడ
● మంత్రి సవితను నిలదీసిన రైతులు
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే
నాణ్యమైన విద్యుత్ అందేదని వెల్లడి
● సమాధానం చెప్పలేక
అధికారులపై తోసేసిన మంత్రి
పరిగి: ‘‘వ్యవసాయానికి రాత్రి పూటే కరెంటు ఇస్తున్నారు. అది కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇలా ఉంటే మేము పంటలు ఎలా పండించుకోవాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అయితే పగటి సమయంలోనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేవారు. అదికూడా 9 గంటలు నిరంతరాయంగా అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ఇదేనా’’ అంటూ మండలంలోని పలు గ్రామాల రైతులు మంత్రి సవితను నిలదీశారు. సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళీ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన పరిగిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం మంత్రి సవిత రాక ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. దీంతో చాలా మంది వెనుదిరిగివెళ్లిపోయారు. ఆ తర్వాత మంత్రి వేదిక వద్దకు రాగానే రైతులు విద్యుత్ సమస్యపై ఆమెను నిలదీశారు. దీంతో ఏం చెప్పాలో తెలియని మంత్రి... అక్కడే ఉన్న విద్యుత్ అధికారులను సమాధానం చెప్పడంటూ గదమాయించారు. దీంతో ప్రభుత్వ పాలసీ అలా ఉంటే మేమేం చెప్పేదంటూ వారు నీళ్లు నమిలారు.
అధికారులపై మంత్రి ఆగ్రహం
పరిగి మండలంలో కొన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కష్టపడి పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం ఆమె పైడేటి వద్ద దాదాపు రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దారు హసీనా సుల్తానా, ఎంపీడీఓ శ్రీధర్, ఎంఈఓలు లక్ష్మీదేవి, శేషాచలం, ఏఓ విజయభారతి తదితరులు పాల్గొన్నారు.
వాగులోని ఇసుకకూ అనుమతి తప్పనిసరి
హిందూపురం అర్బన్: స్థానికులు ఎవరైనా సరే తమ అవసరాలకు సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకువెళ్లాలన్నా ఆన్‌లైన్ ద్వారా అనుమతి పొందాల్సిందే. ఈ మేరకు జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి స్థానిక అవసరాలకు ప్రభుత్వం అనుమతించిన వాగులు, వంకలు నుంచి ఇసుక తరలించాలంటే తప్పని సరిగా ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టం వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇసుక కావాల్సిన వారు ఇంటి నంబర్, గ్రామం, మండలం, జిల్లా, సంబంధిత సచివాలయం తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదంతా నమోదు చేసిన తర్వాత తగిన రసీదు తీసుకొని దగ్గర ఉంచుకుని ఇసుక రవాణా చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఇసుక రవాణా చేసేందుకు 24 గంటల ముందే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా ఇసుక వాహనం రోడ్డుపైకి వస్తే దాన్ని అక్రమ రవాణాగా గుర్తించి సీజ్ చేసేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఉచిత శిక్షణ,
ఉద్యోగావకాశాలు
పుట్టపర్తి టౌన్: డీఆర్‌డీఏ – సీడాప్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. సీ–డాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి సహకారంతో జిల్లాలోని నిరుద్యోగ యువతకు టెలీకాం సెక్టార్‌లో ఫీల్డ్ మేనేజ్మెంట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ కోర్స్‌లపై ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెలుగు ఏపీఎం లక్ష్మీనారాయణ, జాబ్ కోఆర్టినేటర్ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఇంటర్, డిప్లొమా, ఐఐటీ పూర్తి చేసిన వారు, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికై న అభ్యర్థులకు భోజన వసతి కల్పించి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు సైతం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 28 తేదీలోపు పుట్టపర్తి పట్టణంలోని ఈశ్వరమ్మ మండల సమాఖ్య కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 9640899337 నంబరులో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment