సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
ప్రశాంతి నిలయం: ‘‘కలెక్టరేట్‌లో అయితే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడి వరకూ వస్తున్నారు. ఎంత సమయమైనా వేచి చూసి తమ సమస్యను అర్జీల రూపంలో ఇస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముకానివ్వకండి. ప్రతి అర్జీకి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపండి. సమస్యల పరిష్కారంలో అలసత్వం వీడండి. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తాం’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై 215 అర్జీలు అందగా...వాటి పరిష్కారం కోసం ఆయాశాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరీశీలించి సరైన పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ ఇక నుంచి ఈ–ఆఫీస్ ద్వారానే జరగాలని, తద్వారా పనులు వేగవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రావు, పౌరసరఫరాల శాఖ మేనేజర్ అశ్వర్థ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు
ఫీజులు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోయినా, తరగతులకు వెళ్లకుండా అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఫీజులు చెల్లించలేదన్న కారణంతో ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసిందన్నారు. ఇప్పటికై నా వారు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఫీజుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం జీఓ నం 87 జారీ చేసిందని, అందులో ఫీజుల చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు.
పెట్రోల్ బాటిల్‌తో కలెక్టరేట్‌కు...
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో రావడం కలకలం రేపింది. గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన చెన్నప్ప పెట్రోల్ బాటిల్‌తో కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో పాల్గొనేందుకు వచ్చాడు. అయితే ప్రవేశద్వారం వద్ద ఆయన్ను పోలీసులు తనిఖీ చేశారు. సంచిలోని పెట్రోల్ బాటిల్ కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. తాను రైతునని, భూ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని తెలపడంతో అతన్ని నేరుగా కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. కలెక్టర్ టీఎస్ చేతన్ ఆరా తీయగా... తనకు మల్లాపల్లి పంచాయతీలో పొలం ఉందని, తహసీల్దార్ పాసుపుస్తకం ఇవ్వడం లేదని వాపోయాడు. స్పందించిన కలెక్టర్ చేతన్... వెంటనే చెన్నప్ప సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి అర్జీకి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలి
అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment