జగన్‌తోనే కురుబల ఆత్మగౌరవం పదిలం
రాప్తాడు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో కురుబల ఆత్మగౌరవం పదిలంగా ఉంటూ వచ్చిందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి కురుబలు తలెత్తుకునేలా చేశారని మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో సోమవారం నిర్వహించిన భక్త కనకదాస జయంతి వేడుకలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. భక్త కనకదాస విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం శంకరనారాయణ మాట్లాడుతూ... తాను మంత్రిగా ఉన్న సమయంలో భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న విజ్ఞప్తి మేరకు అప్పటి సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి వెంటనే జీఓ విడుదల చేశారని గుర్తు చేశారు. సమాజంలో మార్పుకోసం కృషి చేసిన మహనీయుడు కనకదాస జీవిత చరిత్ర చూస్తే విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనేది కనకదాస ఆశయమన్నారు. ఆనాడే ఉన్నత చదువులు అభ్యసించి సమాజాన్ని అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన కనకదాస.. కుల వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేశారన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ... భక్త కనకదాస మార్గం అందరికీ ఆచరణయోగ్యమన్నారు. ఐక్యమత్యంతోనే కురుబలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గొరవయ్యలకు పాలు పోసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నసనకోట ముత్యాలమ్మ ఆలయ మాజీ చైర్మన్ ముత్యాలు, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, నియోజకవర్గ అధ్యక్షుడు బిల్లే నరేంద్ర, జిల్లా కార్యదర్శి వెంకటాపురం మురళి, ఎంపీటీసీ రుక్మిణమ్మ, కురుబ సంఘం నాయకులు పసుపుల ఆది, నరసింహగౌడ్, రాజహంస శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి మాలగుండ్ల,
మాజీ ఎంపీ గోరంట్ల
Comments
Please login to add a commentAdd a comment