కూలీలు, దళితుల సమస్యలు పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ఉపాధి కూలీలు, దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు, దళితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలోని పలు మండలాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో దళితుల సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. గోరంట్ల, ముదిగుబ్బ, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, చిలమత్తూరు, సోమందేపల్లి, రొద్దం మండలాల్లోని దళితులకు శ్మశాన వాటికలు లేవన్నారు. కొన్ని దళితుల వాడల్లో నేటికీ పూరి గుడిసెలే కనిపిస్తున్నాయన్నారు. వీరికి తక్షణమే నివేశన స్థలాలు మంజూరు చేసి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. ఉన్న ఊళ్లలో పనులు లేకపోవడంతో బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు ఉపాధి కూలీలు వలస పోతున్నారన్నారు. వలసల నివారణకు చర్యలు చేపట్టి ఉపాధి కూలీలకు పని ముట్లు అందజేయడంతో పాటు రోజు వారీ కూలి రూ.400 చెల్లించాలని, 150 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షుడు అంజనేయులు, కమిటీ సభ్యులు స్వర్ణలత, రమాదేవి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కూలీల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment