AP: రేపటి నుంచి ఒంటిపూట బడులు | AP Half Day Schools From 18th March 2024 - Sakshi
Sakshi News home page

AP: రేపటి నుంచి ఒంటిపూట బడులు

Published Sun, Mar 17 2024 1:05 AM | Last Updated on Sun, Mar 17 2024 11:59 AM

- - Sakshi

అన్ని యాజమాన్య పాఠశాలల్లో పక్కాగా అమలు

టెన్త్‌ పరీక్షలు ఉన్న బడుల్లో మధ్యాహ్నం తరగతుల నిర్వహణ

ప్రభుత్వ బడుల్లో జగనన్న గోరుముద్ద తిన్నాకే పిల్లలు ఇళ్లకు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా వ్యాప్తంగా సోమ వారం నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సి పల్‌, మోడల్‌స్కూల్స్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల మేనేజ్‌మెంట్‌లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈనెల 18వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరం ఆఖరి పనిదినం అనగా ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపా టు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒంటిపూట బడులను నిర్వహించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు సూచిస్తున్నారు. విద్యాశాఖ నిర్దేశించిన పలు ఆదేశాలు/సూచనలను ఆయన పాఠశాలలకు చేరవేశారు.

గోరుముద్ద తిన్నాకే.. పిల్లలు ఇంటికి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ‘జనగన్న గోరుముద్ద’ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీనియస్‌గా తీసుకుంది. బడుల్లో భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తారు. ఒంటిపూట బడుల సమయంలోనూ నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనాలు అందించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ సూచనలు తప్పనిసరి

పాఠశాలలో బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాదు.

అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి.

ఎండల నేపధ్యంలో విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్‌ రీ–హైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.

బడుల్లో సన్‌/హీట్‌ స్ట్రోక్‌ బారిన పడితే, వైద్య–ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఉపయోగించాలి.

మధ్యాహ్న భోజన సమయంలో స్థానికుల సమన్వయంతో మజ్జిగ అందించాలి.

ఎస్‌ఏ–2 పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement