కూనకు మళ్లీ నిరాశ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు మరోసారి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపింది. చివరికి విప్ పదవి కూడా ఇవ్వలేదు. తాజాగా 16 మందిని విప్‌లుగా ప్రకటించగా అందులో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు చోటు దక్కింది. ఈ తాజా పరిణామంతో కూన రవికుమార్ ఆశలు క్రమేపీ గల్లంతవుతున్నాయి. ఆయన్ని రెండు అదృశ్యశక్తులు తొక్కేస్తున్నాయి. ఆ అదృశ్య శక్తులు కింజరాపు ఫ్యామిలీకి చెందిన మంత్రులే అయి ఉండొచ్చని ప్రచారం కూడా జరిగిపోతోంది. పరిస్థితి చూస్తుంటే కూనకు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే పదవి తప్ప మరొకటి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకో అధిష్టానం కూడా నిరాదరణకు గురి చేస్తోంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా అధ్యక్షుడిగా కూన రవికుమార్ కష్టపడి పనిచేశారు. పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. వివాదాస్పద నేతగా రాజకీయాలు చేసినప్పటికీ పార్టీకి మాత్రం ప్లస్ అయింది. దీంతో అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని భావించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేబినెట్ కూర్పులో తప్పకుండా కూన రవికుమార్ పేరు ఉంటుందని అనుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలి ఉందని అంతా ఊహించారు. కానీ జాబితాలో పేరు లేదు. దీంతో ఒక్కసారి కూన శిబిరం నిరాశతో పాటు ఆవేదనకు గురైంది. కేబినెట్‌లో బెర్త్ తప్పినా ఆ స్థాయి పదవి మరొకటి వస్తుందని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఒక్కొక్కటీ చేజారిపోతున్నాయి..
మొన్నటికి మొన్న టీటీడీ బోర్డులో చోటు దక్కుతుందని భావించారు. అందులో కూడా నిరాశే ఎదురైంది. చివరికి విప్ పదవైనా వస్తుందని ఆశపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 16మందిని ప్రకటించగా అందులో జిల్లాకు చెందిన బెందాళం అశోక్‌కు చోటు దక్కిందే తప్ప కూన రవికుమార్‌కు స్థానం కల్పించలేదు. దీంతో గతంలో నిర్వహించిన విప్ సైతం ఆయనకు దూరమైంది. ఇక, చెప్పుకోదగ్గ పదవులు మరేవీ లేవు. కీలకమైన నామినేటేడ్ పదవులు కూడా భర్తీ అయిపోయాయి. ఇప్పటికై తే కూనకు ఇంతే. ఇవ్వడానికి కూడా సరైన పదవుల్లేవు. దీంతో కూనకు ఎమ్మెల్యే పదవి తప్ప మరొకటి వచ్చే దారులు కనిపించడం లేదు.
తొక్కేస్తున్నది కింజరాపు ఫ్యామిలీయేనా!
కూన రవికుమార్‌కు ప్రభుత్వంలో ప్రమోషన్ దక్కకుండా, కీలక పదవులు రాకుండా చేస్తున్నది కింజరాపు ఫ్యామీలికి చెందిన ఇద్దరు మంత్రులేనా ? అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో కూన రవికి ఉన్నత పదవులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే వాదన నడుస్తోంది. జిల్లాలో తమదే ఏకఛత్రాధిపత్యం కొనసాగాలని, మరొకరికి పదవి ఇస్తే మరో పవర్ సెంటర్ తయారవుతుందని, ముఖ్యంగా కూన రవికుమార్‌కు ఇస్తే తమ పట్టు సడలుతుందనే అభిప్రాయంతో వ్యూహాత్మకంగా కుట్రలు పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయమై బహిరంగంగా ఓపెన్ కాకపోయినప్పటికీ తన అనుయాయుల వద్ద కూన రవికుమార్ కూడా చెబుతున్నట్టుగా సమాచారం. పదవులు రాకుండా అడ్డుకుంటున్నదే వారేనని చెప్పకనే చెబుతున్నారు. ఆ అనుమానంతో తన వర్గీయులెవ్వరూ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు వద్దకు వెళ్లవద్దని, పనుల కోసం కలవవద్దని చెబుతున్నట్టుగా తెలిసింది. మొత్తానికి తన రాజకీయ ఎదుగుదలకు కింజరాపు ఫ్యామిలీ బ్రేక్ వేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.
విప్ పదవి సైతం దక్కని పరిస్థితి
వరుసగా చేజారిపోయిన పదవులు
బెందాళం అశోక్‌కు విప్ పదవి కేటాయింపు
అదృశ్య శక్తులుగా గండికొడుతున్నది
కింజరాపు ఫ్యామిలీయేనని అనుమానం!
Comments
Please login to add a commentAdd a comment