పట్టుబడిన ఒడిశా గంజాయి బ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టుబడిన ఒడిశా గంజాయి బ్యాచ్‌

Published Wed, Nov 13 2024 12:53 AM | Last Updated on Wed, Nov 13 2024 12:53 AM

పట్టుబడిన ఒడిశా గంజాయి బ్యాచ్‌

పట్టుబడిన ఒడిశా గంజాయి బ్యాచ్‌

శ్రీకాకుళం క్రైమ్‌: బొలేరోలో భారీగా గంజాయి అక్రమ రవాణా.. వాహనంలో ఉన్న ముగ్గురిదీ ఒడిశానే.. అక్కడి నుంచి మెళియాపుట్టి మీదుగా పలాస హైవే చేరుకుని అక్కడి నుంచి తమిళనాడు కు చేరుకోవడమే వీరి ప్లాన్‌. గతంలో ఎన్నోసార్లు ఇలా పథక రచన విజయవంతంగా అమలు చేశా రు. ఈసారి పోలీసుల కంట పడ్డారు. ఆ సమయంలో తప్పించుకునే క్రమంలో మరో నేరం చేయడంతో పదిరోజులు ఆలస్యమైనా జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. గత నెల 24న మెళియాపుట్టి మండలం తూముకొండ ఆకులమ్మ ఆలయం వద్ద ద్విచక్రవాహనాన్ని అక్ర మ గంజాయి తరలిస్తున్న బొలేరోతో ఢీకొని వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు సాంకేతికత సాయంతో వారిని గుర్తించగా ఒడిశా గంజాయి బ్యాచ్‌గా తేలింది. వీరిని మంగళవారం అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఒడిశాకు చెందిన హోంగార్డు కూడా ఉన్నారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళ వారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఒకరికొకరు సాయంగా..

ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా పుట్టసింగి పీఎస్‌ పరిధి పెండగుడి గ్రామానికి చెందిన ఆయుబ్‌ మాఝి(35) గంజాయి సాగు చేసేవాడు. అదే రాష్ట్రం గజపతి జిల్లా శాంతినగర్‌కు చెందిన రంజిత్‌ భర్దన్‌ (31) గంజాయి ఎక్కడ ఉన్నా సమకూర్చేవాడు. వీరిద్దరికీ అదే రాష్ట్రం గజపతి జిల్లా ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు అభిమాఝి తోడై తమిళనాడు, ఇతర ప్రాంతాలకు తరలించడంలో సహకారమందించేవాడు.

ప్రమాదం జరగడంతో..

గత నెల 24న ఒడిశా గజపతి జిల్లా నుంచి అడవా ప్రాంతం ఉటుక గ్రామం నుంచి నుంచి తమిళనాడుకు 16 బస్తాల్లో 563.9 కిలోల గంజాయిని తరలించే క్రమంలో మెళియాపుట్టి వద్ద పోలీసులను చూసి అధిక స్పీడుతో బండిని నడిపారు. జాడుపల్లి దాటి తూముకొండ ఆకులమ్మ ఆలయం దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడం.. గ్రామస్తులు, పోలీసులు వెంబడించడం.. తిరిగి జాడుపల్లి వద్దకే బండిని తెచ్చి వదిలేసి అందులో ఉన్న ముగ్గురూ పరారయ్యారు. బొలేరాలో ఉన్న గంజాయిని గుర్తించిన పోలీసులు ఆ రోజే వాహనాన్ని సీజ్‌ చేశారు. అదన పు ఎస్పీ (క్రైమ్‌) పాత్రిని శ్రీనివాసరావు పర్యవేక్షణలోని రెండు ప్రత్యేక బృందాలు సాంకేతికత ఆధారంగా ముందుగా ఆయుబ్‌ మాఝీని గుర్తించి అనంతరం రంజిత్‌ బర్ధన్‌ను, సహకరించిన హోంగార్డు అభి మాఝిని గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయి విక్రయంతో సమకూర్చుకున్న ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. కేసును ఛేదించిన అడిషనల్‌ ఎస్పీ పి.శ్రీనివాసరావు, పాతపట్నం సీఐ వి.రామారావు, మెళియాపుట్టి ఎస్‌ఐ పి.రమేష్‌బాబు, కానిస్టేబుళ్లు జగన్నాథం, గౌరీశంకర్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

బొలేరో డ్రైవర్‌, యజమాని, హోంగార్డు అరెస్టు

16 బస్తాల్లో 563.9 కిలోల గంజాయి స్వాధీనం

గంజాయి కట్టడికి కైనెన్‌ డాగ్స్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : గంజాయి అక్రమ రవాణాపై మరింత నిఘా పెట్టనున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరారైన 56 మంది గంజాయి నిందితుల్లో ఏడుగురిని ఇప్పటికే పట్టుకున్నామని, నగరానికి చెందిన మరో ముగ్గురిని గుర్తించామన్నారు. మిగతా వారంతా ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన నిందితులేనని వెల్లడించారు. బస్సులు, రైళ్లు, కార్లే కాకుండా తనిఖీ చేసేవారమని ఇకపై కంటైనర్లు, ట్రక్కులు (బొలేరా)పైనా నిఘా పెడతామన్నారు. గంజాయి ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే డ్రోన్‌ సర్వే చేపట్టామని, గంజాయి వాసనను గుర్తించే కైనెన్‌ డాగ్‌ను తీసుకెళ్లి పరిశీలిస్తున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement