రూ.50 వేలు విలువ చేసే మందులు స్వాధీనం
జలుమూరు: అల్లోపతి మందుల నిల్వకు అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు ఎం.చంద్రరావు, తనిఖీ అధికారి ఎన్.యుగంధరరావు అన్నా రు. బుధవారం శ్రీముఖలింగంలో అనుమతు లు లేకుండా మందుల నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు గ్రామానికి చెందిన పెడ్డ రామ్మోహనరావు అనే ఆర్‌ఎంపీ ఇంటి వద్ద తనిఖీ చేశారు. సుమారు రూ.50వేలు విలువైన అనుమతులు లేని మందులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే మందులు నిల్వలకు, కొనుగోలు, విక్రయాలకు లైసెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు.
నాణ్యత ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదు
కొత్తూరు: పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ రెడ్డి అన్నారు. మండలంలోని రాయల పంచాయతీ పరిధి ఎర్రటిగూడ గిరిజన గ్రామంలో సీతంపేట ఐటీడీఓ నిధులతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ కేంద్ర భవనాల పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఒప్పంద ప్రకారం నిర్దేశించిన తేదీకి పనులు పూర్తి చేయాలని సూచించారు.
కురిగాం వార్డెన్‌పై విచారణ
కొత్తూరు: మండలంలోని కురిగాం ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిపై బుధవారం స్థానిక ఈఓపీఆర్డీ వసంత కుమారి వసతి గృహం వద్ద విచారణ చేశారు. అయితే స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్లు ఆమెకు అందించలేదు. విచారణ మధ్యలోనే వార్డెన్ వెళ్లిపోయారని ఈఓపీఆర్డీ తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లిపోవడంతో వారిని విచారించలేదన్నారు. వార్డెన్ పనితీరు బాగు లేదని గ్రామస్తులు తెలిపినట్లు ఈఓపీఆర్డీ చెప్పారు. విచారణ నివేదిక ఎంపీడీఓకు అందజేస్తానని తెలిపారు.
కిడ్నీ ఆస్పత్రికి రెండు
ఫార్మసిస్టు పోస్టుల మంజూరు
కాశీబుగ్గ: పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు ఇద్దరు ఫార్మసిస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ ఆఫీసర్ల సంఘం ఉపాధ్యక్షుడు బోనెల గోపాల్, జిల్లా అధ్యక్షులు రేజేటీ సుబ్రహ్మణ్యంలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కిడ్నీ రోగులకు ఇకపై ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆశ్రమ పాఠశాల
మెనూపై మండిపాటు
కాశీబుగ్గ: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు అధికారులకు ఆదేశించారు. మందస మండలంలోని బుడంబో ఆశ్రమ పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. భోజనం రుచికరంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం, డిప్యూటీ వార్డెన్‌లకు మెమోలను జారీ చేయాలని డీడీకి ఆదేశించారు. తరగతి గదులను, భోజనశాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment