సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి ఎంపీ టికెట్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఆయా పార్టీల్లోని ఆశావహులు తమ గాడ్ ఫాదర్‌ల ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఆశావహుల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులు ఎవరనేది ఇంకా నిర్ణయించకపోయినా ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో వారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.
నల్లగొండలో ఎక్కువ మంది..
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే తాను ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్‌ను మాజీమంత్రి దామోదర్‌రెడ్డికి కేటాయించడంతో ఆ టికెట్‌ను ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ప్రస్తుతం రఘువీర్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్న నేపథ్యంలో పటేల్ రమేష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారా? లేదా ఎంపీ టికెట్ ఇస్తారా? ఏం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
పటేల్ రమేష్‌రెడ్డికి ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా ఇస్తారనే చర్చ సాగుతోంది. బీఆర్‌ఎస్‌లోనూ పలువురు ఆశావహలు ఎంపీ టికెట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఆశించారు. అయినా అధిష్టానం ఇవ్వలేదు. తన కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్ కావాలని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం నల్లగొండ లేదా భువనగిరిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు చర్చ సాగుతోంది. వారే కాకుండా ఓ వ్యాపారవేత్తతోపాటు మరికొందరు కూడా నల్లగొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
భువనగిరి నుంచి పోటీకి పలువురి ఆసక్తి
భువనగిరి పార్లమెంట్‌లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా పోటీ ఉంది. ఏడెనిమిది మంది అక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి ఎంపీగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి పోటీ చేస్తారని గతంలో చర్చ జరగ్గా.. ఇటీవల కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తన కూతురు కీర్తిరెడ్డి కోసం టికెట్ అడుగుతుండగా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, గొంగిడి మహేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమవేశం జరిగింది. ఈ సమావేశంలో ఎవరిని పోటీలో ఉంచాలన్న దానిపైనా చర్చ జరక్కపోయినా ఆశావహలు మాత్రం తమకు టికెట్ కావాలన్న విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌తోపాటు మరో ఇద్దరు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నుంచి పది మంది..
బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉంది. పది మంది ఆశావహులు తమకు టికెట్ కావాలని అడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గార్లపాటి జితేందర్, మన్నెం రంజిత్‌యాదవ్, నూకల నర్సింహారెడ్డి, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్‌రెడ్డి, లాలూనాయక్, నాగం వర్షిత్‌రెడ్డి, నివేదితారెడ్డి, సత్యనారాయణ, మన్మథరెడ్డి తమకు ఎంపీ టికెట్ కావాలని అడిగారు. బీజేపీ నుంచి కూడా అంతమంది టికెట్ అడుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment