సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఈ సంవత్సరంలో తలకిందులయ్యాయి. 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. రాజకీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయగా, బీఆర్‌ఎస్ డీలా పడిపోయింది. బీజేపీ, సీపీఎం పోటీ చేసినా కనీస ఉనికిని చాటులేకపోయాయి. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొంది రికార్డు సృష్టించింది. అప్పటి వరకు 12 స్థానాలు కలిగిన బీఆర్‌ఎస్ డీలా పడి ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది.
బీఆర్‌ఎస్‌కు చుక్కెదురు!
బీఆర్‌ఎస్‌కు 2023 సంవత్సరం కలిసి రాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వరుసగా రెండుసార్లు ప్రజలు గులాబీ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. బీఆర్‌ఎస్ పాలనపై వ్యతిరేకత రావడంతో 2023 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించారు.
కేటీఆర్ కూడా ఆశీర్వాద సభలు, రోడ్‌షోల ద్వారా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఇంకా దత్తత అయిపోలేదు. కొనసాగుతుందని జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పినప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విశ్వసించలేదు. దీంతో 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో అపజయం పాలైంది. ఒక్క సూర్యాపేటలో మాత్రం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి గెలుపొందారు.
కాంగ్రెస్‌ను ఆదరించిన జిల్లా ప్రజలు..
2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. తెలంగాణ వచ్చాక పదేళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది కంచుకోటగా ఉంటూ వచ్చింది. కానీ.. మొన్నటి ఎన్నికల ముందు వరకు ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఉనికి చాటుకోలేకపోయిన బీజేపీ, సీపీఎం
బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలై ఉనికి చాటుకోలేకపోయింది. ఇక సీపీఎం ఉమ్మడి జిల్లాలోని ఏడు స్థానాల్లో పోటీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడా డిపాజిట్ దక్కించుకోలేదు. ఇక కాంగ్రెస్‌తో పొత్తుల వ్యవహారంతో సీపీఐ జాగ్రత్తగా వ్యవహరించింది. ఎక్కడా సొంతంగా పోటీకి దిగలేదు. దీంతో సీపీఐ బలాబలాలు ఈ ఎన్నికల్లో బయట పడలేదు.
జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పదేళ్ల తర్వాత నల్లగొండ జిల్లాకు మళ్లీ జోడు మంత్రి పదవులు లభించాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు ఒకటే మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment