ప్రజా ఆరోగ్యంతో చెలగాటం
సూర్యాపేటటౌన్: రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అడుగు పెట్టగానే నోరూరించే చికెన్ బిర్యానీతో పాటు పలు రకాల ఐటమ్స్ ఆహ్వానిస్తుంటాయి. అయితే అది కేవలం గుమగుమలాడే వాసన తప్పితే ఆహార పదార్థాల్లో అంతా కల్తీమయమే. ఎన్నో రోజుల నుంచి ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన చికెన్, కాలం చెల్లిన కలర్స్ వాడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం చేసిన దాడుల్లో జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్ల కల్తీ ఆహార బాగోతం బయటపడింది. అయితే ఎప్పుడో ఒకసారి కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
విచ్చలవిడిగా ఆహారం కల్తీ..
జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లలో టేస్ట్ కోసం కెమికల్ సాల్ట్ వేస్తున్నారు. వివిధ రకాల ఫ్లేవర్లు, కలర్లు కలుపుతున్నారు. వంటకు ఉపయోగించే అల్లం, కారం పొడి, వివిధ రకాల మసాలాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఒకవైపు కాలం చెల్లిన ఉత్పత్తులు, మరోవైపు కుళ్లిన పదార్థాలతో తయారు చేస్తున్న ఆహారం జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా
వెయ్యికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు
జిల్లా వ్యాప్తంగా వెయ్యి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, బేకరీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 200కు పైగా ఉంటాయి. కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే దురాశతో కల్తీ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫుడ్ టేస్ట్ కోసం కలర్ వచ్చేందుకు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫార్మాల్డీ హైడ్ వంటి కెమికల్స్ కలుపుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. మరోపక్క కుళ్లిన చికెన్, బేకరీల్లో కాలం చెల్లిన కలర్స్, క్వాలిటీ లేని ఆయిల్స్ వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ఆహార తయారీ దారులు, ఆహార పదార్థాలు అమ్మేవారు నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఆహారం కల్తీ చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సూర్యాపేటలోని కొన్ని రెస్టారెంట్లు, బేకరీల్లో తనిఖీలు చేపట్టాం. వాటిలో కుళ్లిన చికెన్, కాలం చెల్లిన ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించాం. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించాం. రిపోర్ట్ రాగానే వాటిపై చర్యలు తీసుకుంటాం.
– జ్యోతిర్మయి, స్టేట్ ఫుడ్ సేఫ్టీ
టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్
కుళ్లిన చికెన్, కాలం చెల్లిన కలర్స్ వాడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు
పాడైపోయిన పదార్థాలతో
ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ
కాసుల కోసం నిర్వాహకుల కక్కుర్తి
ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల
దాడుల్లో బయటపడ్డ నాణ్యతలేని ఆహారపదార్థాలు
ఇటీవల తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం
జిల్లా కేంద్రంలో ఈ నెల 14న రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో పలు హోటళ్లలో దాడులు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని ఎల్‌ఎస్ బేకరీ, కావేరి గ్రాండ్ హోటల్, తనుస్ లోగిలి హోటల్, డాల్ఫిన్ బేకరీల్లో తనిఖీలు చేసి, కుళ్లిన మాంసం, హానికర రంగులు కలిపిన చికెన్, పలు రకాల చేపలు, తందూరి చికెన్, కుళ్లిపోయిన గుడ్లు, నిల్వ ఉంచిన గోధుమపిండి గుర్తించారు. అదేవిధంగా బేకరీల్లోని వంట గదిలో అపరిశుభ్రంగా ఉండడం, వాడిన నూనెను మళ్లీ మరగబెట్టి వాడటాన్ని గుర్తించారు. కలర్ స్ప్రేలు, లేబుల్ డిక్లరేషన్ లేనటువంటి కేక్, బ్రెడ్ ప్యాకెట్లను ధ్వంసం చేసి బేకరీ యజమానులకు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment