108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
మఠంపల్లి : పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆదివారం ఆడబిడ్డకు జన్మనించింది. 108సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోజ్యాతండాకు చెందిన గర్భిణి అజ్మీరా రోజా పురిటినొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో మహిళను వాహనంలో హుజూర్‌నగర్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా పెదవీడు వద్దకు చేరుకోగానే నొప్పులు ఎక్కువై 108సిబ్బంది సహాయంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో కాన్పు చేసిన 108సిబ్బందిని పలువురు అభినందించారు.
విద్యుత్ స్తంభం పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం
పెన్‌పహాడ్ : ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు భిక్షం(40) అదే గ్రామానికి చెందిన దండెంపల్లి సుధాకర్ వ్యవసాయ క్షేత్రంలో స్తంభంపై విద్యుత్ తీగలు తీసేందుకు భిక్షంను కూలీ పనులకు తీసుకెళ్లాడు. విద్యుత్ తీగలను లాగుతున్న క్రమంలో స్తంభం పైన ఉన్న భిక్షం తాడు సహాయంతో విద్యుత్ తీగను అందుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ గోపికృష్ణను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఉరివేసుకుని
మహిళ ఆత్మహత్య
నకిరేకల్ : ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన పందిరి నాగమ్మ(38) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. నాగమ్మ మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అద్దె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు సూరారం భద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.
స్వాతంత్య్ర
సమరయోధురాలు మృతి
మోతె : మండల పరిధిలో రావిపహాడ్ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధురాలు కోట లక్ష్మమ్మ(101) ఆదివారం తెల్లవారుజామున మరణించింది. కోట లక్ష్మమ్మ కుటుంబం మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారు. నాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధ పోరాట దళంలో రావిపహడ్ గ్రామ కమ్యూనిస్టు ఉద్యకారులతో కలిసి లక్ష్మమ్మ పనిచేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కోట లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు (కోట పాపిరెడ్డి, కోట గోపాల్‌రెడ్డి, కొప్పుల సూర్యమ్మ, నందిగామ సుజాత) ఉన్నారు. రావిపహడ్‌కు చెందిన కమ్యూనిస్టు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు కోట లక్ష్మమ్మ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొడపంగి యలమంచి, సురేందర్‌రెడ్డి, కోడి గంగయ్య, పాపిరెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment