రుణ మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం
కేతేపల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేతేపల్లిలో నూతనంగా నిర్మించిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి స్మారక భవనాన్ని(సీపీఎం మండల కార్యాలయం)సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డితో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రూ.31 వేల కోట్లు ఖర్చవుతుందని, కానీ, కేవలం రూ.18 వేల కోట్లు మాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందన్నారు. రైతు భరోసా, వ్యవసాయ కార్మికులకు ఏటా రూ.12వేలు, మహిళలకు నెలకు రూ.2500 పంపిణీ ఊసే లేకుండా పోయిందన్నారు. బీజేపీ అణగారిన వర్గాల కోసం కాకుండా.. కేవలం అదానీ,అంబానీల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. పదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతుందని విమర్శించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి చింతమళ్ల లూర్దుమారయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, బొజ్జ చినవెంకులు, అశోక్‌రెడ్డి, కోట లింగయ్య, ఎల్.రాజు, శోభన్, ఎ.సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
Comments
Please login to add a commentAdd a comment