బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తే సహించేది లేదు
హాలియా : బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. హాలియాలో కవయిత్రి మొల్ల మాంబ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హాలియా పట్టణంలో చేపట్టిన చలో బీసీ.. హలో హాలియా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. హాలియా పట్టణంలో కుమ్మర సోదరులు మొల్లమాంబ విగ్రహాన్ని పెడుతుంటే దురుద్దేశంతో సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ నేతల విగ్రహాలను జేసీబీలతో తొలగిస్తే బీసీలంతా ఐక్యంగా రాజకీయ పార్టీల నాయకుల కుర్చీలను కూల్చివేస్తామని హెచ్చరించారు. జానారెడ్డికి పదవి వ్యామోహం ఇంకా తగ్గలేదని, తన తనయులకు పదవులు వచ్చేలా చేసుకున్నారన్నారు. హాలియా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైశ్య కులానికి చెందిన పార్వతమ్మను పదవి నుంచి తొలగించి నరేందర్‌రెడ్డి అనే వ్యక్తికి పదవి కట్టబెట్టారని విమర్శించారు. బీసీ కులానికి చెందిన వెంకటేశ్వర్లు యాదవ్‌ను మార్కెట్ చైర్మన్ పదవి నుంచి తొలగించి శేఖర్‌రెడ్డిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. బీసీలు అధికారంలోకి రాగానే ఉద్యోగాలు పొందిన ఓసీలను రీకాల్ చేస్తామన్నారు. మొల్ల మాంబ విగ్రహాన్ని అవమానపర్చిన మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే కేవలం ఒక్క బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారని, మిగిలిన ఎనిమిది మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెబితే జానారెడ్డి దానిని అడ్డుకున్నారని ఆరోపించారు. త్వరలో నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు నల్లగొండ ఎన్జీ కాలేజీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, బీసీ నాయకులు, వట్టె జానయ్య, మహేష్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, సుదర్శన్, పొదిలి శ్రీనివాస్, నల్లగొండ సుధాకర్, సైదులుగౌడ్, అర్జున్, కోట్ల వాసు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Comments
Please login to add a commentAdd a comment