తిరువళ్లువర్‌కు మళ్లీ కాషాయం | Sakshi
Sakshi News home page

తిరువళ్లువర్‌కు మళ్లీ కాషాయం

Published Sat, May 25 2024 4:15 PM

తిరువళ్లువర్‌కు మళ్లీ కాషాయం

● రాజ్‌భవన్‌లో తిరువళ్లువర్‌ డే ● నిఘా కట్టుదిట్టం

సాక్షి, చైన్నె: తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌కు మళ్లీ కాషాయం రంగు పులిమారు. ఈ సారి రాజ్‌భవన్‌ వేదికగా కాషాయం వస్త్రంతో కూడిన తిరువళ్లువర్‌ ఫొటోను ఆయన విగ్రహం వద్ద ఉంచడం వివాదానికి దారి తీసింది. తిరువళ్లువర్‌ డే పేరిట శుక్రవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నేతృత్వంలో వేడుక జరగడంతో రాజ్‌భవన్‌ పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

తమిళ కవి, తమిళ తిరుక్కురల్‌ గ్రంథం రచయిత, తత్వవేత్త తిరువళ్లువర్‌ పేరిట ప్రతి సంవత్సరం జనవరి 16న తిరువళ్లువర్‌ దినోత్సవాన్ని అధికారిక వేడుకగా జరుపుకోవడం తెలిసిందే. తమిళులు తిరుక్కురల్‌ను పవిత్ర గ్రంథంగా భావిస్తుంటారు. తిరుక్కురల్‌ను గౌరవించే విధంగా ముందుకెళ్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనకు రాజకీయ రంగుతోపాటు కాషాయ వస్త్రాన్ని దిద్దే పనిలో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తరచూ రచ్చకెక్కడం జరుగుతోంది. ఈసమయంలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సైతం కొత్త బాటను అనుసరించే విధంగా తీసుకున్న నిర్ణయం శుక్ర వారం చర్చకు దారితీసింది. తిరువళ్లువర్‌ మే 24న జన్మించినట్టుగా పేర్కొంటూ, ఆయన పేరిట కార్యక్రమాల ఆహ్వాన పత్రికను రాజ్‌భవన్‌ విడుదల చేసింది. తిరువళ్లువర్‌ దినోత్సవం జరుపుకుందా మని ఇచ్చిన ఈ ఆహ్వానం తమిళాభిమానులలో ఆగ్రహాన్ని రేపింది. ఉదయాన్నే రాజ్‌భవన్‌ నుంచి మైలాపూర్‌కు వెళ్లిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిరువళ్లువర్‌ ఆలయంలో పూజలు చేశారు. ఇక్కడి జరిగిన కార్యక్రమాలలో పాల్గొని రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్‌భవన్‌లోని తిరువళ్లువర్‌ విగ్రహం వద్ద కాషా యం వర్ణంతో కూడిన ఆయన చిత్ర పటాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సమాచారంతో తమిళాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పనిలో పడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా రాజ్‌భవన్‌ ఉన్న గిండి పరిసరాలలో భద్రతను అమాంతంగా పెంచారు. ఆ పరిసరాలలో డేగ కళ్ల నిఘాతో పోలీసులు వ్యవహరించారు. గవర్నర్‌ తీరుపై న్యాయశాఖా మంత్రి రఘుపతి స్పందిస్తూ, వాదించే వారితో వాదనలకు సిద్ధం అని, తాను చేసేదే రైట్‌ అన్నట్టుగా పట్టు వీడకుండా ముందుకు సాగే వారిని ఎలా పిలవాలో ప్రజలే అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement