అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష | - | Sakshi
Sakshi News home page

అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

Published Thu, Oct 24 2024 1:41 AM | Last Updated on Thu, Oct 24 2024 1:41 AM

అధికారులతో  డిప్యూటీ సీఎం సమీక్ష

అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

సాక్షి, చైన్నె: ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ బుధవారం తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమల్లో ఉన్న పథకాలు, ప్రాజెక్టుల తీరు తెన్నులపై సమీక్షించారు. తమిళనాడు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి స్కీం, తమిళనాడు అర్బన్‌ డెవలప్‌ స్కీం, ప్రాజెక్ట్‌ , దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య శిక్షణ కార్యక్రమం, గ్రామీణ మహిళలు ఆర్థిక బలోపేతం, స్వయం సహాయక బృందాలకు చేయూత, రుణ పంపిణీ తదితర అంశాల గురించి అధికారులతో చర్చించారు. తమిళనాడు మహిళా అభివృద్ధి పథకం ద్వారా మహిళలను ఉన్నత స్థితికి చేర్చడం లక్ష్యం అని, ఆ దిశగా పథకం అమలు విస్తృతం కావాలని అధికారులను ఉదయ నిధిస్టాలిన్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివద్ధి, పంచాయతీ శాఖ ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్‌సింగ్‌ బేడీ, తమిళనాడు మహిళా అభివద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రేయ బి సింగ్‌, డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీబీసీఐడీ ఐజీగా అనిషా హుస్సేన్‌

సాక్షి, చైన్నె : చైన్నె సీబీసీఐడీ విచారణ విభాగం ఐజీగా అనిషా హుస్సైన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు అనిషాహుస్సేన్‌ రిజర్వులో ఉండగా, ప్రస్తుతం పోస్టింగ్‌ కల్పించారు. అలాగే రిజర్వులో ఉన్న మరో ఐపీఎస్‌ అధికారి ఎస్‌ సర్వేశ్‌ రాజ్‌కు పోలీసు మాస్టర్‌ కంట్రోల్‌ రూం ఎస్పీగా బాధ్యతలను అప్పగించారు.

గూడ్స్‌ను ఢీకొట్టే

ముందే పట్టాలు తప్పిందా?

వెలుగులోకి కవర పేట రైలు ప్రమాదం వీడియో దృశ్యాలు

సాక్షి, చైన్నె: గూడ్స్‌ రైలును ఢీ కొట్టేందుకు ముందుగానే ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడం, వేగం తగ్గడం వంటి పరిణామాలతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. దీంతో కుట్రకోణంలో దర్యాప్తు వేగాన్ని పెంచేందుకు రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు. వివరాలు.. ఈనెల 11న చైన్నె శివారులోని కవర పేట రైల్వే స్టేషన్‌ వద్ద లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను దర్బాంగ భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ మార్గంలో ప్రమాదానికి ముందుగా కొద్ది రోజుల పాటు జరిగిన పరిణామాలను విచారణ బృందం పరిగణించింది. అలాగే బోల్టులు, నట్టులు ఊడి ఉండటం వంటి అంశాలతో కుట్ర కోణం మీద దృష్టి పెట్టారు. ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితులో ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు విచారణ బృందానికి చిక్కినట్టు సంకేతాలు వెలువడ్డాయి. లూప్‌ లైన్‌లోకి వస్తున్న రైలు వేగం తగ్గడంతో పాటు ముందుగానే పట్టాలు తప్పడం, ఆతర్వాత గూడ్స్‌ను ఢీకొనడం వంటి దృశ్యాలు అందులో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా కుట్రకోణం దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ముందుగానే రైలు పట్టాలు తప్పడం, వేగం తగ్గడంతో భారీ ప్రాణ నష్టం జరగలేదని, లేకుంటే అత్యంత భారీ మూల్యాన్ని చవి చూడాల్సి వచ్చేదని ఆ వీడియో దృశ్యాల ఆధారంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.

చైన్నె నుంచి స్వస్థలాలకు

10 లక్షల మంది

సాక్షి,చైన్నె : దీపావళికి వరుసగా నాలుగు రోజులు సెలవు రావడంతో చైన్నె నుంచి పది లక్షల మంది స్వస్థలాలకు బయలు దేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బస్సులు, ఆమ్నీ ప్రైవేటు బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుని ఉండడం గమనార్హం. వివరాలు.. రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలు, ప్రాంతాలకు చెందిన వారు అధికంగా చైన్నెలో ఉద్యోగం, వివిధ పనుల నిమిత్తం ఉన్నారు. వీరంతా పండగ సెలవులతో స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 14 వేల మేరకు బస్సులను నడిపేందుకు సిద్దమైంది. ఇక, ప్రైవేటు ఆమ్నీ బస్సులు సైతం లగ్జరీ సేవలతో రెడీ అయ్యాయి. ఇప్పటికే సాధారణంగా ఆయా ప్రాంతాల వైపుగా వెళ్లు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. అదనంగా రైలు సేవలకు దక్షిణ రైల్వే చర్యలు చేపట్టి ఉంది. తాంబరం – తిరునల్వేలి, ఎంజీఆర్‌ సెంట్రల్‌ – కోయంబత్తూరు, యశ్వంత్‌ పుర్‌ – కోట్టయం మధ్య ప్రత్యేక రైలు సేవలకు బుధవారం నిర్ణయించారు. మరిన్ని అదనపు రైలు సేవలకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని దక్షిణ రైల్వేకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఆరు లక్షల మంది చైన్నె నుంచి బస్సులలో వెళ్లారని, ఈసారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 10 లక్షల మంది స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు, ఈ దృష్ట్యా, దక్షిణ తమిళనాడు వైపుగా మరిన్ని రైలు సేవలకు సిద్ధం కావాలని కోరడం గమనార్హం. ఇదిలా ఉండగా దీపావళి సందర్భంగా మాంసం విక్రయాలు జోరుగానే ఉంటాయి. చైన్నెలో బుధవారం జరిగిన సంతలో 25 వేల మేకలు అమ్ముడు పోయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement