● రాణి పేటలో జిల్లా క్రీడా ప్రాంగణం ● పనులకు శంకుస్థాపన
ఆధ్యాత్మిక నగరం మదురైలో ఒలింపిక్ అకాడమీ ఏర్పాటు కానుంది. పనులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే రాణిపేటలో నిర్మించనున్న క్రీడా ప్రాంగణం పనులను కూడా ప్రారంభించారు. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ హాస్టళ్లలో ఉంటూ చదువుతున్న క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, క్రీడా కిట్లను అందజేశారు. రాష్ట్ర క్రీడల శాఖ, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ నేతృత్వంలో చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
సాక్షి, చైన్నె: క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న డీఎంకే ప్రభుత్వం మరో ముందగుడు వేసింది. ఇందులోభాగంగా రూ. 15 కోట్లతో రాణి పేటలో నిర్మించున్న క్రీడా ప్రాంగణం, సముదాయం పనులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే ఆధ్యాత్మిక నగరంగా, దక్షిణ తమిళనాడులోని జిల్లాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మదురైలో రూ. 6 కోట్లతో ఒలింపిక్స్ అకాడమీ ఏర్పాటు పనులను సైతం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటన్న 553 మంది క్రీడాకారులకు ఛాంపియన్స్ కిట్‌లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 మందికి ఈ కిట్లు అందనున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో రాణించిన వారిని ఈసందర్భంగా ఉదయ నిధి అభినందించారు.
గర్వకారణం..
ఈ కార్యక్రమంలో ఉదయ నిధి ప్రసంగిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. అందుకే నేడు వివిధ అంతర్జాతీయ , జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు దూసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా సోదరులైన ప్రవీణ్, రమేష్, సంతోష్,, సోదరీమణులు సుభా, విద్య తమిళనాడు నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లారని భారత దేవం గర్వ పడేలా చేశారని కొనియాడారు. బీఆర్‌ఐసీ బీచ్ వాలీబాల్‌లో పూంతమిళన్, ఏషియన్ గ్రేడ్ – 2 జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్ (ఆసియన్) పవిత్ర రజతం, సన్నిత తదితరులైన హాస్టల్ క్రీడాకారులు పతకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నేటి క్రీడా రంగంలో ఉన్న వారంతా రేపటికి గొప్ప సాధకులుగా
అవతరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం, వారి విజయానికి మద్దతు, భరోసా , నమ్మకం కలిగించే విధంగా ఛాంపియన్స్ కిట్‌లను అందజేస్తున్నామన్నారు. ఈ కిట్‌లో ఎనిమిది రకాల వస్తువులు ఉన్నాయని వివరించారు. దేశ విదేశాలలో జరిగే పోటీలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న వారి ఖర్చుల విషయంలో ఆందోళనను వీడాలని, ప్రతిభకు ఆర్థిక స్తోమత అడ్డుకాకూడదన్నారు. ఇందుకు తమిళనాడు ఛాంపియన్స్ ఫౌండేషన్ ఉందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 600 మందికి పైగా క్రీడాకారులకు రూ. 14 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. ప్రతిభ కలిగిన కీడాకారులు టీఎన్‌ఛాంపియన్స్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని సూచించారు.
బహిరంగ చర్చకు సిద్ధం..
అనంతరం మీడియాతో ఉదయ నిధి మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వ పథకాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, బహిరంగ చర్చకు ఆయన సిద్ధమైతే, తాను సిద్ధమేనని సవాల్ చేశారు. గత పదేళ్లలో వాళ్లు ఒరగబెట్టిందేమిటో, మూడున్నరేళ్ల పాలనలో తాము సాధించిన ప్రగతి ఏమిటో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ పథకాలకు దివంగత అధినేత కలైంజ్ఞర్ పేరు పెట్టకుండా, మరెవ్వరి పేరు పెట్టమంటారు? అని ప్రశ్నించారు. చైన్నెలో క్రీడా నగరం ఏర్పాటు గురించి ప్రశ్నించగా, పరిశీలన, అధ్యయన ప్రక్రియ జరుగుతోందని, మూడు నెలలలో నివేదిక అందుతుందన్నారు. తర్వాత పనుల మీద దృష్టిపెడుతామన్నారు.
ఆధునిక సౌకర్యాలు..
క్రీడాకారులకు అంతర్జాతీయిలో శిక్షణ, ఆధునిక సౌకర్యాల కల్పనలో వెనుకాడబోమని ఉదయనిధి స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఆధునిక సౌకర్యాల కల్పన మరింత విస్తృతం చేశామన్నారు. ఇండోర్ స్టేడియంలో మహిళలకు బాక్సింగ్ వేదిక ఏర్పాటు చేశామని, ఓపెన్ గ్రౌండ్‌లో వెయిట్‌లిఫ్టింగ్ హాల్, జిమ్‌ను అంతర్జాతీయ ఫ్రమాణాలతో పునరుద్ధరించినట్లు వివరించారు. ఇక్కడున్న ప్రతి క్రీడాకారుడి కుటుంబంలో సభ్యుడిగా, సోదరుడిగా తాను చెబుతున్నానని, అందరికీ ద్రవిడ మోడల్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమం, క్రీడలశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment