తప్పు చేస్తే...ఉపేక్షించొద్దు | - | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే...ఉపేక్షించొద్దు

Published Tue, Nov 12 2024 7:54 AM | Last Updated on Tue, Nov 12 2024 7:54 AM

తప్పు చేస్తే...ఉపేక్షించొద్దు

తప్పు చేస్తే...ఉపేక్షించొద్దు

● ఫీల్డ్‌ టీంకు పళణి ఆదేశాలు ● నియోజకవర్గ బాటలో నేతలు

సాక్షి, చైన్నె: శ్రీతప్పు చేస్తే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించ వద్దనిశ్రీ ఫీల్డ్‌ సర్వే బృందానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎవరెవరు ఏఏ తప్పులు చేసి ఉన్నారో అన్న సమగ్ర వివరాలను నివేదిక రూపంలో డిసెంబరు 7వ తేదీ నాటికి సమర్పించాలని సూచించి ఉన్నారు. వివరాలు.. 2026 అసె ంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వీరికి చెక్‌ పెట్టి అధికారం తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు అన్నాడీఎంకే సైతం ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టింది. బలమైన కూటమి ఏర్పాటు, అధికార పగ్గాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఫీల్డ్‌ సర్వే పేరిట ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం నియోజకవర్గాల బాటకు సిద్ధమైంది.

సమాలోచన..

పార్టీ పరిస్థితులను జిల్లా, నగర, మండల స్థాయిలోకి వెళ్లి తెలుసుకునేందుకు, కేడర్‌ అభిప్రాయాలను, నేతల పనితీరును అధ్యయనం చేయడం కోసం ఫీల్డ్‌ సర్వేకు పళణి నిర్ణయించారు. ఆయా ప్రాంతాలలో పార్టీ నేతల పనితీరు, అనుబంధ విభాగాల పనితీరు ఎలా ఉందో? అధ్యయనం చేయడమే కాకుండా, ప్రజలతో, కింది స్థాయి కేడర్‌తో సంప్రదింపులు జరిపి అభిప్రాయాల సేకరణ దిశగా ఫీల్డ్‌ సర్వేకు ముఖ్య నేతల బృందాన్ని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, దిండుగల్‌ శ్రీనివాసన్‌, నత్తం విశ్వనాథన్‌, తంగం తెన్నరసు, తంగమణి, ఎస్పీ వేలుమణి, టి. జయకుమార్‌, సీవీ షణ్ముగం, సెమ్మలై, వలర్మతి, అరుణాచలం వంటి నేతలు ఈ కమిటీలో ఉన్నారు. వీరితో సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌మాళిగైలో పళణి స్వామి సమావేశమయ్యారు. నేతల సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సర్వే బృందంలోని ఒక్కో నేతకు తలా 20 నుంచి 25 అసెంబ్లీ నియోజవకర్గాలను అప్పగించారు. తమకు కేటాయించిన నియోజకవర్గాలలో ఈ నేతలు అధ్యయనం చేయనున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. కేడర్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో పళణి స్వామి మాట్లాడినట్టు అంశాలలో కొన్ని సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు పార్టీకి చెందిన నియోజకవర్గం, జిల్లా స్థాయి నేతల పనితీరు గురించి చర్చించాలని, అభిప్రాయాలు సేకరించాలనిసూచించి ఉన్నారు. తప్పులు ఎవరు చేసినా ఉపేక్షించ వద్దని, ఫీల్డ్‌ సర్వే పూర్తిగా బహిర్గతంగానే ఉండాలని, రహస్యాలు, గోప్యత అవసరం లేదని పేర్కొన్నారు. పాక్షపాతం వద్దని, అన్ని స్థాయిలోని వారిని కలిసి అభిప్రాయాలు సేకరించాలని, ఎవరు తప్పు చేసిన వారి వివరాలతో సమగ్ర నివేదికను డిసెంబరు 7లోపు సమర్పించాలని స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement