● ప్రభుత్వ పాఠశాలలో వింత శిక్ష ● ప్రధానోపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్
అన్నానగర్: తరగతి గదిలో మాట్లాడిన కొందరు విద్యార్థుల నోటికి టేపు అంటించిన ఘటన సంచలనమైంది. వివరాలు.. తంజావూరు జిల్లా ఒరత్తనాడు పంచాయతీ యూనియన్ పరిధిలోని అయ్యంబట్టి గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, కొందరు గ్రామస్తులు సోమవారం తంజావూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల నోటికి ప్లాస్టర్ (టేపు) అంటించారని ఫొటోగ్రాఫిక్ ఆధారాలతో కలెక్టర్ ప్రియాంక పంకజంకు వినతిపత్రం ఇచ్చారు. ఇందులో అయ్యంబట్టి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 5 మంది విద్యార్థుల నోటికి ప్లాస్టర్ వేసి 4 గంటలపాటు ఉంచారని ఆరోపించారు. దీంతో విద్యార్థులకు అస్వస్థత ఏర్పడిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈమేరకు విచారణ చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక పంకజం పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment