3.50 కోట్ల మందికి తాగునీరు
తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 3.50 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీటిని అందజేసినట్టు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నెహ్రూ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి కార్పొరేషన్ పరిధిలో రూ.59.92 కోట్ల వ్యయంతో చేపడుతున్న తాగునీటి విస్తరణ పథకం, రూ.98.59 కోట్ల వ్యయంతో సబ్‌వే డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మంగళవారం ఆవడిలో జరిగింది. కార్యక్రమాలకు రాష్ట్ర మంతులు, నాజర్, నెహ్రూ హాజరయ్యారు. ఆవడి పరిధిలో వేర్వేరు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న 25 కార్పొరేషన్‌లకు దశల వారిగా 24 గంటలు తాగునీటిని అందజేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో ముందుగా ఆవడి కార్పొరేషన్‌ను ఎంపిక చేసి గత ఏడాది పనులను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం మంది మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నారని, వీరందరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గత మూడేళ్లలో రూ.75 వేల కోట్లు మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేటాయించారని, గత అన్నాడీఎంకే హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను సైతం తాము సరి చేశామన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణస్వామి, దురైచంద్రశేఖర్, ఆవడి మేయర్ ఉదయకుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ శివరాజు, కమిష నర్ కందస్వామి, డీఆర్వో రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment