● చైన్నె నగరం, శివారులలో భారీ వర్షం ● విమానాలు, రైలు సే
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. చైన్నె నగరం, శివారు జిల్లాలలో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. చైన్నెలో మంగళవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో ఉదయాన్నే వాహనదారులకు అవస్థలు తప్పలేదు. అయితే సిబ్బంది గంటల వ్యవధిలోనే నీటిని తొలగించారు. వర్షాల నేపథ్యంలో చైన్నె రిప్పన్ బిల్డింగ్‌లోని కంట్రోల్ రూమ్‌లో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించారు.
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో సోమవారం సాయంత్రం అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాత్రంతా చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో అనేక చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. చైన్నెలో వర్షం కారణంగా పలు విమాన సేవలకు ఆటంకాలు తప్పలేదు. భారీ వర్షంతో విమానాలు కొన్ని అర్ధగంట ఆలస్యంగా టేకాఫ్, ల్యాండింగ్‌లు తీసుకున్నాయి. అలాగే మంగళవారం ఉదయం దక్షిణ తమిళనాడు నుంచి చైన్నె వైపుగా అన్ని రైళ్ల సేవలు ఆలస్యంగా జరిగాయి. గంట ఆలస్యంగా తాంబరం, ఎగ్మూర్ స్టేషన్లకు రైళ్లు వచ్చి చేరాయి. చైన్నె నగరంలో పలు మార్గాలలో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ఆగమేఘాలపై తొలగింపు పనులు చేపట్టారు. గంట..గంటన్నర వ్యవధిలో నీళ్లన్నీ తొలగాయి. ఈ సమయంలో వాహన దారులకు అవస్థలు తప్పలేదు. ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. ఉదయం వరకు వర్షం కొనసాగడంతో చైన్నెలో పాఠశాలలకు మాత్రం సెలవు ప్రకటించారు. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో చెదురుముదురు వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటలో చైన్నె పెరుంగుడిలో అత్యధికంగా 8 సెం.మీ, మీనంబాక్కం, ఆలందూరు, అడయార్, నందనంలలో 6 సెం.మీ వర్షం కురిసింది. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు, సుంగువారి సత్రం, పడప్‌పై, చెంగల్పట్టు జిల్లా ఊరపాక్కం, గూడువాంజేరి పరిసరాలలో మోస్తరుగా వర్షం కురిసింది. పంబల్ – అనకాపుత్తూరు మార్గంలో గతుకులతో నిండిన రోడ్డులో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చైన్నె నగరంలో మెట్రో రైలు పనులు జరుగుతున్న మార్గాలలో ట్రాఫిక్ కష్టాలు మరింతగా తప్పలేదు. కోరైకుప్పంలో అలల లాకిడికి లంగరు వేసి ఆపి ఉన్న చిన్న చిన్న పడవలు సముద్రంలో కొట్టుకెళ్లడంతో జాలర్లు అప్రమత్తమై ఒడ్డుకు చేర్చారు. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో తిరువొత్తియూరు, కాశిమేడు పరిసర జాలర్లు చేపల వేటకు వెళ్లలేదు. అన్నానగర్‌లో రెండు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో చైన్నె నగరంలో 19 వేల చెట్లకు ఉన్న కొమ్మలను ముందు జాగ్రత్తగా తొలగించే పనులు వేగవంతం చేశారు.
తమిళనాడు వైపుగా కదులుతున్న ద్రోణి
చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు వరకు వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో నెలకొన్న ద్రోణి బలహీన పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బలహీన పడ్డ ఈ ద్రోణి తమిళనాడు వైపుగా ప్రయాణిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కుస్తాయని, అయితే నష్టం వాటిల్లే రీతిలో ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఇక బుధ, గురువారం చైన్నె, శివారు జిల్లాలలో 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు దక్షిణ తమిళనాడు , పశ్చిమ కనుమల వెంబడి అనేక జిల్లాలో మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, మన్నార్ వలిగుడా దీవి, కన్యాకుమారి, దక్షిణ ఆంధ్రా వైపుగా సముద్రంలో గంటకు 55 కి.మీ వేగం వరకు గాలులు వీస్తాయని, అలల తాకిడి అధికంగా ఉంటుందని వివరించారు. ఈ ప్రాంతాల వైపుగా వేటకు వెళ్ల వద్దని జాలర్లను హెచ్చరించారు. ఈ అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం లేదని, ఇది బలహీన పడి తీరం వైపుగా కదులుతున్నట్టు స్పష్టం చేశారు. అక్టోబరు 1వ తేదీ నుంచి మంగళవారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాలల్‌లో 25 సెం.మీ వర్షం కురిసిందన్నారు. ఈ కాలంలో 25.9 సె.మీ వర్షంకు రావాల్సి ఉందని, అయితే, ఒక శాతం తక్కువ అని పేర్కొన్నారు.
చైన్నెలో వర్షంలో పాట్లు
కంట్రోల్ రూమ్‌లో డిప్యూటీ సీఎం
చైన్నెలో రాత్రంతా వర్షం కురవడంతో ఉదయాన్నే డిప్యూటీసీఎం ఉదయనిధి స్టాలిన్ కార్పొరేషన్ భవనం రిప్పన్ బిల్డింగ్‌లోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి నీళ్లు త్వరితగతిన తొలగించే పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టా లిన్ మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యలు మరియు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించామన్నారు. 1,194 మోటార్ పంపులు, 158 సూ పర్ పవర్ మెషీన్లు, 524 జెట్ రాడింగ్ యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. 329 సహాయ కేంద్రాలు, 120 ఆహార తయారీ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అక్టోబరులో కురిసిన వర్షం సందర్భంగా సాగిన సహాయక చర్యలను గుర్తు చేస్తూ, ఈ సారి ఏ ఒక్క సబ్‌వేలోనూ నీళ్లు చేరలేదన్నారు. 21 సబ్ వేలలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయని వివరించారు. చైన్నెలోనే కాదు, తిరుచ్చి, మదురై, తంజావూరుల తదితర జిల్లాలో ముందు జాగ్రత్తలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, వర్షాలు విస్తారంగా కురుస్తుండటం, ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు విస్తృతం చేయా లని, సర్వం సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment