స్టార్టప్‌లకు ప్రోత్సాహం
పాంబన్ వంతెనపై ఆందోళన చేస్తున్న జాలర్ల కుటుంబాలు
● హిజ్రాలు, దివ్యాంగులకు నిధి సాయం
● డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
● చైన్నెలో ముగిసిన చెస్ టోర్నీ
సాక్షి, చైన్నె : కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు సంపూర్ణ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది నుంచి స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చే దివ్యాంగులు, హిజ్రాలకు నిధి ప్రోత్సాహం అందించేందుకు సీఎం స్టాలిన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. మద్రాసు ఐఐటీ పరిశోధన విభాగంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ నేతృత్వంలో కొత్త స్టార్టప్‌ల ఏర్పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో కొత్త ఆవిష్కరణలను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిచయం చేశారు. అర్హులైన వారికి ప్రోత్సహకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 2030 నాటికి ట్రిలియన్ ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సీఎం స్టాలిన్ పరిశ్రమలకు, చిన్న, మధ్య తరహా స్టార్టప్‌లకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. వెనుకబడిన సామా జిక వర్గం నుంచి పారిశ్రామిక ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు రూ. 30 కోట్లు గతంలో కేటాయించారని, ప్రస్తుతం ఈమొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి కోసం ప్రత్యే నిధి కేటాయించి ఉన్నామని గుర్తు చేస్తూ, ఈ ఏడాది నుంచి దివ్యాంగులు, హిజ్రాలను సైతం ప్రోత్సహించే విధంగా ముందుకెళ్లబోతున్నామన్నారు. కొత్త ఆలోచనలు, కొత్త అంశాలతో వచ్చే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆలోచలనతో వస్తే చాలు అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధం అని, అవసరం అయితే, శిక్షణ అందించేందుకు కూడా రెడీ అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ మంత్రి అన్బరసన్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ
చైన్నెలో జరుగుతూ వచ్చిన చైన్నె గ్రాండ్ మాస్టర్స్ 2024 చెస్ టోరీ సోమవారం రాత్రి జరిగిన వేడుకతో ముగిసింది. వారం రోజులు చైన్నెలో జరిగిన ఈ పోటీల ఫైనల్స్ సోమవారం జరిగింది. ఇందులో గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను రాష్ట్రానికి చెందిన అరవింద్ చిదంబరం దక్కించుకున్నారు. రాత్రి అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. చెస్ క్రీడాకారులు అరవింద్ చిదంబరం, ప్రణవ్‌లకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ట్రోఫీ, నగదు బహుమతి చెక్కులను అందజేశారు. సింగపూర్‌లో జరగనున్న వరల్డ్ చెస్ పోటీలకు సిద్ధమవుతున్న గ్రాండ్ మాస్టర్ గుకేష్ కు రూ. 10 లక్షలు చెక్కును అందజేశారు. చైన్నె గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో గ్రాండ్ మాస్టర్స్ విభాగంలో మొదటి బహుమతి రూ. 15 లక్షలు, ఛాలెంజర్స్ విభాగంలో ప్రథమ బహుమతి రూ. 6 లక్షలు అందజేశారు. ఈ పోటీలో బహుమతులు గెలుచుకున్న లెవాన్, అర్జున్, అమీన్, మాగ్జిమ్. బర్హమ్, అలెక్సీ, విదిత్ సంతోష్ మురళి, ప్రాణేష్, అభిమన్యు, హారిక, వైశాలి తదితరులను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అభినందించారు. ఈ పోటీలలో మొత్తంగా రూ. 70 లక్షలను అందజేశారు. కార్యక్రమంలో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ , క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ సీఈఓ, సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment