● శ్రీలంకలో మగ్గుతున్న తమిళ జాలర్ల విడుదలకు డిమాండ్ ● కేంద్ర మంత్రికి సీఎం లేఖ
సేలం: శ్రీలంకలో జైలులో ఉన్న జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాలర్లు మంగళవారం పాంబన్ వంతెనపై ఆందోళన చేపట్టారు. గత జనవరి నెల నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్ర జాలర్ల 66 పడవలను స్వాధీనం చేసుకుని, 497 మంది జాలర్లను శ్రీలంక సముద్రతీర బలగాలు అరెస్టు చేశారు. శ్రీలంక అరెస్టు చేసిన జాలర్లపై ఆ దేశ చట్టాల ప్రకారం జైలులో బంధిస్తున్నారు. ఈ విధంగా 90 మంది జాలర్లు ఆరు నెలలో నుంచి రెండేళ్ల శిక్షతో ఖైదీలుగా మగ్గుతున్నారు. ఈ స్థితిలో ఆదివారం అరెస్టు చేసిన 23 మంది జాలర్లను, మంగళవారం అరెస్టు చేసిన 12 మంది జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాలర్ల కుటుంబాలు పాంబన్ వంతెనపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అనంతరం జాలర్లు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. శ్రీలంకలో మగ్గుతున్న జాలర్లను విడుదల చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సంఘటన అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆందోళన చేపట్టిన జాలర్ల వద్ద జిల్లా పోలీసు కమిషనర్ సతీష్ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అనంతరం జాలర్ల కుటుంబాలు ఆందోళనను విరమించారు. ఈ కారణంగా పాంబన్ – మదురై జాతీయ రహదారి రెండు గంటల పాటు వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
విదేశాంగ మంత్రి సీఎం లేఖ
రామేశ్వరంకు చెందిన 23 మంది జాలర్ల ఈ నెల 9వ తేది శ్రీలంక సముద్రతీర బలగాలు అరెస్టు చేసిన స్థితిలో మంగళవారం నాగపట్నంకు చెందిన 12 మంది జాలర్లను సరిహద్దులు దాటి చేపలు పడుతున్నారని ఆరోపిస్తూ శ్రీలంక బలగాలు అరెస్టు చేశారు. శ్రీలంక సముద్ర తీర బలగాలు అరెస్టు చేసిన తమిళ జాలర్లు అందరినీ, వారి పడవలను వెంటనే విడుదల చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను మంగళవారం ఒక లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment