కొరుక్కుపేట: తాంబరం అటవీ ప్రాంతంలో తుపాకీ కల్గి ఉన్న ముగ్గురు రౌడీలను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. పేరు మోసిన రౌడీ లెనిన్, ఇతని అనుచరులు ఎరుమయూర్ సమీపంలోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తలదాచుకున్నట్టు డిప్యూటీ కమిషనర్‌కు చెందిన స్పెషల్ పోలీసు ఫోర్స్‌కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న స్పెషల్ స్క్వాడ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎరుమయూర్ అటవీ ప్రాంతంలోకి పోలీసు రావడం చూసి అక్కడ దాకున్న రౌడీ లెనిన్ సహా మగ్గురు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని చుట్టుముట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మధువీరపట్టు ప్రాంతానికి చెందిన లెనిన్ (36)పై 27కిపైగా కేసులు ఉన్నాయి. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వచారణ చేస్తున్నారు.
అఘోరాపై
లైంగిక వేధింపుల ఫిర్యాదు
అన్నానగర్: చైన్నెకి చెందిన కలైయరసన్ అనే యువకుడు అఘోరాగా మారి జ్యోతిష్యం చెపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అఘోరి కలయరసన్‌పై అతని భార్య భాగ్యలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అఘోరి కలైయరసన్ నిధి, చేతబడి వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తేలింది. దీంతో ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విద్యార్థినికి లైంగిక వేధింపులు
–పూజారికి దేహశుద్ధి
అన్నానగర్: కోయంబత్తూరులోని కన్నప్పనగర్‌లో కళాశాల విద్యార్థినిని లైంగికంగా వేధించిన పూజారిపై జిల్లా శిశు సంక్షేమ అధికారి విచారణ చేపట్టారు. కోయంబత్తూరులోని కన్నప్పనగర్‌కు చెందిన రమేష్ (47) పూజారి. గాంధీపురం ప్రాంతంలోని ధర్మాదాయ శాఖ ఆధీనంలోని ఓ ఆలయంలో గత 10 ఏళ్లుగా అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కన్నప్పనగర్‌లోని ముత్తుమారియమ్మన్ ఆలయంలో కూడా పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పిల్లలను పూజకు వెళ్లే ప్రాంతాలకు తీసుకెళ్లడం ఆనవాయితీ. రెండు రోజుల క్రితం గుడిలో పూజాకార్యక్రమం ఉందని చెప్పారు. కన్నప్పనగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిని పూజకు తీసుకెళ్లాడు. అనంతరం అర్చకుడు విద్యార్థినిని ఆలయంలోని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. షాక్‌కు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక కుటుంసభ్యులు, స్థానికులు పూజారికి దేహశుద్ధి చేశారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 23 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,446 మంది స్వామివారిని దర్శించుకోగా 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment