రూ. 190 కోట్లతో ఆలయాల అభివృద్ధి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పన దిశగా రూ.190.40 కోట్లతో 29 కొత్త ప్రాజెక్టులకు బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 42.75 కోట్లతో పూర్తి చేసిన 27 ప్రాజెక్టులను ప్రారంభించారు. అందరికీ అర్చకత్వంతో పాటు ఆలయాల అభివృద్ధి, కుంభాభిషేకాలు అంటూ చారిత్రక ప్రాజెక్టులపై రాష్ట్ర హిందూ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక సేవే కాదు, కొత్త విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు దేవదాయ శాఖలోని వ్యవహారాలన్ని కంప్యూటరీకరణ పనులు వేగవంతం చేశారు. ఈ పరిస్థితులలో హిందూ ధర్మాదాయ శాఖ ద్వారా 18 దేవాలయాలు, 4 కార్యాలయాలలో కొత్త ప్రాజెక్టులకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు మదురై జిల్లా అళగర్ ఆలయంలో రూ. 49.25 కోట్లతో అభివృద్ధి పనులకు నిర్ణయించారు. అలాగే తిరువణ్నామలై అరుణాచలేశ్వర ఆలయంలో రూ. 44.57 కోట్లతో సిబ్బందికి గృహాలు, అభివృద్ధి పనులు, కుబేర లింగం సమీపంలోని కమర్షియల్ కాంప్లెక్స్, కొత్తగా విద్యుదీకరణతో అలంకరణ పనులు, తండరాం పట్టు వనపురం మారియ్మన్ ఆలయంలో రూ. 5.63 కోట్లతో ఏడు తీర్థాల పునరుద్ధరణ, తిరువణ్ణామలైలో రూ.107 కోట్లతో కొత్త వివాహ వేదిక, తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయంలో రూ. 25.62 కోట్లతో అభివృద్ధి పనులు, నాగపట్నం జిల్లా తులసీయ పట్నంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో రూ. 18.95 కోట్లతో అభివృద్ధి పనులు, కోయంబత్తూరు జిల్లా మరుదమలై సుబ్రమణ్యస్వామి ఆలయంలో రూ. 6.90 కోట్లతో భక్తులకు సౌకార్యలు, కరుమత్తం పట్టి ఆలయంలో రూ. 2.29 కోట్లతో ఐదు అంచెల కొత్త రాజగోపురం నిర్మాణం, తిరుపూర్ జిల్లా, పెరుమానల్లూర్ కాళియమ్మన్ ఆలయంలో రూ. 5.40 కోట్లతో వివాహ వేదిక, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో రూ. 3.80 కోట్లతో తిరుపతి పాదయాత్రకు వెళ్లే భక్తుల కోసం వసతి గృహం నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈరోడ్ జిల్లా కొడుముడిలోని సడయప్పస్వామి ఆలయంలో రూ.3.80 కోట్లతో పనులు, పెరుందురై సర్కిల్, తంగమేడు, కలై జయన్ స్వామి ఆలయంలో రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో అన్నదాన కేంద్రం, చైన్నె ట్రిప్లికేన్ కబాలీశ్వర ఆలయంలో రూ. 2.35 కోట్లతో, నామక్కల్ జిల్లా వలపూర్‌నాడులోని అరపలీశ్వర స్వామి ఆలయంలో రూ. 210 కోట్లు. పళణియాండవర్ ఆలయంలో రూ. 1.35 కోట్లతో అంటూ మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు మొత్తం రూ. 190.4 కోట్ల తో 29 ప్రాజెక్టులకు వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు.
ప్రారంభోత్సవాలు..
కోయంబత్తూరు మరుద మలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రూ. 4.39 కోట్లతో, మేట్టుపాళయం వన భద్రకాళియమ్మన్ ఆలయంలో రూ. 1.79 కోట్లతో, నాగపట్నంనవనీదేశ్వర స్వామి ఆలయంలో రూ.1.07 కోట్లతో, సమయపురంలో రూ. 4.63 కోట్లతో, మైలాడుతురై శివలోకనాథ ఆలయంలో రూ. 3.20 కోట్లతో అంటూ మొత్తంగా 15 దేవాలయాలు, 2 కార్యాలయాల్లో పూర్తి చేసిన 25 ప్రాజెక్టులను సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, హిందూ, ధర్మాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, అధికారులు శ్రీధర్, సుకుమార్, పెరియస్వామి, జయరామన్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల కుటుంబానికి నిధులు
తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి 10 మంది న్యాయవాదుల కుటుంబాల రూ. కోటి నిధులను సీఎం స్టాలిన్ అందజేశారు. ఈ మొత్తాలను న్యాయవాదుల వారసులకు ఆర్థిక సాయంగా అందజేశారు. తమిళనాడు, పుదుచ్చేరి అడ్వకేట్స్ గ్రూప్ ద్వారా నిర్వహిస్తున్న తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధి నుంచి మరణించిన న్యాయవాదుల వారసులు 10 మందికి తలా రూ. 10 లక్షలను అందజేశారు. అలాగే ఇది వరకు ఈ నిధికి ఇస్తున్న రూ. 8 కోట్లను తాజాగా రూ.10 కోట్లకు పెంచుతూ సీఎం నిర్ణయించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్. రఘుపతి, ఎంపీ విల్సన్, సీఎస్ మురుగానందం, హోంశాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్, లీగల్ సెక్రటరీఎస్. జార్జ్ అలెగ్జాండర్, తమిళనాడు, పుదుచ్చేరి న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు బి.ఎస్. అమల్‌రాజ్, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎస్. ప్రభాకరన్, చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.ఎస్. రామన్, తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ డిప్యూటీ ఛైర్మన్ వి. కార్తికేయ , సీనియర్ న్యాయవాదులు అరుణాచలం, మోహన కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పోషకాహారం నిర్ధారణ లక్ష్యంగా కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం నిర్ణయించింది. అరియలూరులో రూ. 22 కోట్లతో పోషకాహార లోపంతో బాధ పడుతున్న పిల్లల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దీనిని శుక్రవారం సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు.
పనులకు శంకుస్థాపన సీఎం స్టాలిన్
రూ. 27 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
Comments
Please login to add a commentAdd a comment