వైద్యుడిపై కత్తితో దాడి!
● ప్రభుత్వాస్పత్రిలో యువకుడి వీరంగం ● తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ అమానుషం ● విధులు బహిష్కరించిన డాక్టర్లు ● రాష్ట్రవ్యాప్తంగా ఆగిన వైద్య సేవలు ● వైద్య సంఘాలతో డిప్యూటీ సీఎం, మంత్రుల చర్చ
సాక్షి, చైన్నె: క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి ఆరు నెలలగా సరైన వైద్యం అందించ లేదంటూ బుధవారం ప్రభుత్వ వైద్యుడిని చైన్నెలో ఓ యువకుడు విచక్షణా రహితంగా పొడిచేశాడు. ఏడు చోట్ల కత్తి గాయాలతో ఆ వైద్యుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులలో ఆగ్రహం నెలకొంది. అత్యవసర సేవల మినహా తక్కిన వైద్య సేవలను బహిష్కరిస్తూ ఆందోళన బాట పట్టారు. వివరాలు.. చైన్నె గిండిలో దివంగత డీఎంకే అధినేత కరుణానిధి శత జయంతి స్మారక మల్టీ సూపర్ సెషాలిటీ ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో వైద్యుడిగా బాలాజీ జగన్నాథన్ పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆస్పత్రిలోని ఆయన చాంబర్‌లోకి ప్రవేశించిన యువకుడు లోపల గడియ పెట్టేసుకుని ఆయనపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. లోపల ఆయన పెడుతున్న కేకలతో బయట ఉత్కంఠ నెలకొంది. గొంతు, చాతి తదితర ఏడు చోట్ల విచక్షణా రహితంగా కత్తితో పొడిచి పడేసి ఉడాయించే ప్రయత్నం చేసిన ఆ యువకుడిని అక్కడున్న వారు పట్టుకుని గిండి పోలీసులకు అతడిని అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలాజీకి అదే ఆస్పత్రిలో తీవ్ర చికిత్సను అందించారు.
వైద్యులలో పెల్లుబికిన ఆగ్రహం..
వైద్యుడిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడి చేసిన సమాచారం రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లలో ఆగ్రహాన్ని రేపింది. తక్షణం ఓపీ సేవలను వైద్యులు బహిష్కరించారు. అలాగే, వార్డులలో చికిత్సలలో ఉన్న వారికి సైతం సేవలు ఆగాయి. జూనియర్‌లకు శిక్షణ కార్యక్రమాలను నిలుపుదల చేశారు. అత్యవసర విభాగం సేవలు తప్ప, మిగిలిన అన్ని సేవలను ఆపేసి ఆందోళన బాట పట్టారు. తమకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని నినదించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవస్థలు తప్పలేదు. విధుల బహిష్కరణతో సమ్మెబాట పట్టినట్టుగా వైద్య సంఘాలు ప్రకటించాయి.
డిప్యూటీ సీఎం పరామర్శ
దాడి సమాచారంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వానంగా మారాయని, వైద్యులకే భద్రత కరువైందంటూ ప్రతిపక్షాలు అధికార పక్షంపై దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్, బీజేపీ నేత తమిళిసై సౌందరాజన్, పీఎంకే నేత అన్బుమణి రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తదితరులు ఈ దాడిని ఖండించారు. ప్రభుత్వం వైద్యులకు భద్రత కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. అదే సమయంలో సీఎం స్టాలిన్ కూడా దాడిని ఖండించారు. ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇక డిప్యూటీ సీఎం ఉదయనిధి, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు బాలాజీని పరామర్శించారు. మెరుగైన చికిత్సలకు ఆదేశించారు. ఈసందర్భంగా వైద్యులు డిప్యూటీ సీఎం ఉదయనిధి వాహనాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు. భద్రత కల్పించాలని నినదించారు. దీంతో వైద్య సంఘాలను బుజ్జగించే విధంగా చర్చలలో మంత్రి ఎం. సుబ్రమణియన్ నిమగ్నమయ్యారు.
వైద్యం అందించ లేదన్న ఆగ్రహంతోనే..
దాడి చేసిన యువకుడిని చైన్నె శివారులోని పెరుంగళత్తూరుకు చెందిన విఘ్నేష్‌గా పోలీసులు గుర్తించారు. ఇందులో అతడి తల్లి ప్రేమ క్యాన్సర్‌తో బాధ పడుతూ ఉన్నట్టు తేలింది. ఆమెకు గత ఆరు నెలలుగా డాక్టర్ బాలాజీ వైద్యం చేసినట్టు, అయితే, సరైన వైద్యం అందించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీ తీరును విఘ్నేష్ తీవ్రంగా పరిగణించినట్టు విచారణలో వెలుగు చూసింది. ఆరు నెలలుగా తన తల్లికి సరైన వైద్యం అందించక పోవడంతో చివరకు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి కిమో థెరఫీ అందిస్తూ వచ్చినట్టు గుర్తించారు. అదే సమయంలో కిమో థెరఫీ విషయంగా బాలాజీకి ఇది వరకు తాను నగదు ఇచ్చినట్టు ఆ మొత్తం ఇవ్వాలని నిలదీయగా, తన మీద దాడి చేశాడని, అందుకే తన వద్ద ఉన్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచేసినట్లు విఘ్నేష్ ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై 5 సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగినా, ప్రభుత్వ వైద్యులు మాత్రం తీవ్రంగా పరిగణించి ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment