శ్రీ చందన గోపాలకృష్ణాలయం కూల్చివేతకు యత్నం
● స్థానికులు అడ్డగింత ● తాత్కాలికంగా నిలిపివేత ● భక్తులపై పోలీసుల లాఠీచార్జి.. తోపులాట ● స్థానికుల రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం
తిరువళ్లూరు: పుల్లరంబాక్కంలోని శ్రీ చందన గోపాల కృష్ణాలయం కూల్చివేతకు అధికారులు యత్నించారు. అయితే వారి చర్యను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రుక్ష్మిణీ సత్యభామ సమేత శ్రీ చందన గోపాలకృష్ణ శ్రీ సంతాన వినాయకుడి ఆలయం ఉంది. ఆలయానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన వనిత శ్రీధరన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆమె ఆలయానికి వెనుక భాగంలో బాత్‌రూమ్, టాయ్‌లెట్ నిర్మించారు. అయితే ఆలయానికి వెనుక భాగంలో బాత్‌రూమ్, టాయ్‌లెట్లు ఉండడంతో స్థానికులు అధికారులకు రెండేళ్ల కిందట ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు వనిత శ్రీధరన్ నిర్మించిన బాత్‌రూమ్ ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఉండడంతో దాన్ని తొలగించారు. తన ఇంటికి సమీపంలో నిర్మించిన బాత్‌రూమ్‌ను స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు తొలగించడంతో గ్రామస్తులపై కోపంతో బాధితురాలు వనిత శ్రీధరన్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటికి సమీపంలో గోపాల కృష్ణుడి ఆలయం ఉందని, రోడ్డును ఆక్రమించి ఆలయాన్ని నిర్మించారని కోర్టులో పిటిషన్ వేశారు. నడిరోడ్డులో ఆలయం ఉండడం వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని కోర్టుకు నివేదించారు. మహిళ వేసిన పిటిషన్ విచారణ దాదాపు రెండేళ్ల నుంచి విచారణ సాగిన క్రమంలో నడిరోడ్డులో ఉన్న ఆలయాన్ని తొలగించాలని రెవెన్యూ అఽధికారులను కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితురాలు మళ్లీ అప్పీల్ చేశారు. దీంతో కోర్టు సీరియస్‌గా జోక్యం చేసుకుని వారం రోజుల్లో ఆలయాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తహసీల్దార్ వాసుదేవన్ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉండడంతో డీఎస్పీ తమిళరసి, లోకేశ్వరన్ తదితరుల నేతృత్వంలో భారీగా బందోబస్తును మోహరించి, జేసీబీతో ఆలయాన్ని కూల్చివేయడానికి యత్నించారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని ఆలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. జేసీబీపై రాళ్లు రువ్వి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆలయాన్ని కూల్చివేయవద్దని కోరుతూ రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, గ్రామస్తులను చెదరగొట్టి ఆలయానికి రెండు వైపులా వున్న ప్రహరీగోడను కూల్చివేశారు. అయితే స్థానికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆలయాన్ని కూల్చివేసే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment