పాంబన్‌లో రైల్వే భద్రతా కమిషనర్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పాంబన్‌లో రైల్వే భద్రతా కమిషనర్‌ తనిఖీలు

Published Fri, Nov 15 2024 1:41 AM | Last Updated on Fri, Nov 15 2024 1:41 AM

పాంబన్‌లో రైల్వే భద్రతా కమిషనర్‌ తనిఖీలు

పాంబన్‌లో రైల్వే భద్రతా కమిషనర్‌ తనిఖీలు

సాక్షి, చైన్నె : రామనాథపురం జిల్లా రామేశ్వరం సముద్ర తీరంలో పాంబన్‌ రైల్వే వంతెన సిద్ధమైంది. 90 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి ట్రయల్‌ రన్‌ను విజయవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో గురువారం రైల్వే భద్రతా కమిషనర్‌ చౌదరి ఆ మార్గంలో పరిశీలన, తనిఖీలు నిర్వహించారు. ఆథ్యాత్మికంగాను, పర్యాటకంగాను రామేశ్వరం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి రైల్వే మార్గం పయనం ఎంతో ఆహ్లాదకరంగానే కాదు, ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మండపం నుంచి పాంబన్‌ మీదుగా రామేశ్వరం నగరానికి రైలు ప్రయాణం సముద్రం మధ్యలో సాగుతుంది. మండపం నుంచి రామేశ్వరం వైపుగా రైలు సాగేందుకు పాంబన్‌ దీవుల్ని తాకుతూ రైల్వే వంతెన నిర్మించి 105 ఏళ్లు అవుతుంది. ఈ వంతెన వైపుగా నౌకలు వచ్చే సమయంలో లోతైన ప్రాంతం వద్ద రెండుగా ఈ వంతెన తెరచుకుంటుంది. అప్పటి సాంకేతిక పరిజ్ఞానం మేరకు నిర్మించిన ఈ వంతెనకు ఇటీవల కాలంగా తరచూ ఏదో ఒక సమస్య తప్పడం లేదు. అలాగే వంతెన బీటలు వారడం వంటి పరిణామాలతో ప్రస్తుతం ఉన్న వంతెనకు పక్కనే కొత్తగా మరో వంతెన నిర్మాణానికి తగ్గ చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ వంతెన నిమిత్తం సముద్రంలో 140 పిల్లర్లను ఏర్పాటు చేశారు. నౌకలు వచ్చే సమయంలో వంతెన రెండుగా తెరచుకునే ప్రాంతం 22 మీటర్ల ఎత్తులో ఉండేలా వంతెన మార్గం 20 మీటర్ల ఎత్తులో ఉండే రీతిలో నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలు ప్రస్తుతం ముగిశాయి. ఈమార్గంలో ట్రయల్‌ రన్‌ పలు మార్లు ఇప్పటికే విజయవంతమైంది. తుది ట్రయల్‌ రన్‌తో రైలును ఈ మార్గంలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అనుమతులు మంజూరు చేసేందుకు గాను రైల్వే భద్రతా కమిషనర్‌ చౌదరి నేతృత్వంలోని బృందం పరిశీలన జరిపింది. ఆ ట్రాక్‌ను తనిఖీ చేశారు. రైల్వే భద్రతా కమిషనర్‌ అనుమతి దక్కగానే పాంబన్‌కొత్త వంతెన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement