ఆగిన ఓపీ సేవలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా, నగర, రూరల్ హెల్త్ సెంటర్లలో గురువారం ఔట్ పేషంట్ వైద్యసేవలు ఆగాయి. కేవలం అత్యవసర సేవలను మాత్రమే అందించారు. తమకు భద్రత కల్పించాలన్న నినాదంతో వైద్యులు నిరసనలను హోరెత్తించారు. ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణియన్ బుజ్జగింపుతో మెట్టు దిగిన డాక్టర్లు సమ్మె వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాలుగు రకాల ట్యాగ్‌లతో గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. ఔట్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు.
చైన్నె గిండిలోని కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారక ఆస్పత్రిలో కేన్సర్ వైద్య చికిత్స నిపుణుడు బాలాజీపై ఓ యువకుడు బుధవారం కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా తొలి రోజున అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వ వైద్యులు బహిష్కరించారు. గురువారం నుంచి సమ్మె గంట మోగిస్తూ ప్రకటన చేశారు. దీంతో వైద్యులు, జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తించారు. ఔట్ పేషెంట్ సేవలను స్తంభింప చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరయ్యారు. ఓపీ సేవలు ఆగడంతో రోగులకు అవస్థలు తప్పలేదు. గిండి ఆస్పత్రిలో అయితే, వైద్యం కోసం వచ్చిన ఓ యువతి స్పృహతప్పి కింద పడడంతో కలకలం రేగింది. చైన్నెలోని గిండి కలైంజ్ఞర్ ఆస్పత్రి, స్టాన్లీ, కీల్పాకం, రాయపేట, ఓమందూరార్, రాజీవ్‌గాంధీ జిహెచ్‌ల వద్ద నిరసనలు హోరెత్తాయి. ఓపీ సేవల కోసం వచ్చిన రోగులు నిరాశతో వెనుదిరిగారు. గిండిలో జరిగిన నిరసనలో వైద్యులు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. అదే సమయంలో తాను ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్ బాలాజీ ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే, గిండి ఆస్పత్రి డైరెక్టర్ పార్థసారథి స్పందిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క రోగికి మెరుగైన చికిత్స అందించడమే కాదు, ఇక్కడి సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. బాలాజీపై దాడి చేసిన యువకుడు విఘ్నేష్‌కు న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.
వైద్యుల పోరుబాట
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు
మంత్రి బుజ్జగింపుతో మెట్టుదిగిన డాక్టర్లు
సమ్మె వాయిదా
రోగులకు గుర్తింపు కార్డులు
మంత్రి బుజ్జగింపు...
వైద్యులు సమ్మె నినాదం అందుకోవడంతో వారిని ఆరోగ్యమంత్రి ఎం.సుబ్రమణియన్ బుజ్జగించారు. డాక్టర్ బాలాజీని పరామర్శించిన తర్వాత డాక్టర్ల సంఘాలు, పోలీసు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దాడుల కట్టడి దిశగా చర్చించారు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో వైద్యులు శుక్రవారం నుంచి చేపట్టదలచిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఈ వివరాలను మంత్రి ఎం.సుబ్రమణియన్ ప్రకటించారు. డాక్టర్ బాలాజీ ఆరోగ్యంగా ఉన్నారని, నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టామన్నారు. ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించడం తమ బాధ్యత అని, ఆదిశగా కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఆస్పత్రులలో సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతం చేయనున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల హాజరు రికార్డు, బయో మెట్రిక్ విధానం కొనసాగించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో ఔట్‌పోస్టు, పోలీసుల పెట్రోలింగ్ పనులు పూర్తి స్థాయిలో ఏర్పాటు, ఔట్ పోస్టు లేని ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు, ఉన్న చోట్ల అదనపు సిబ్బంది నియామకానికి నిర్ణయించామన్నారు. ప్రధానంగా రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులతో పాటు అటెండెంట్లు, పరామర్శలకు వచ్చే వారికి నాలుగు రకాల గుర్తింపు కార్డులను అందజేయనున్నామన్నారు. సమావేశంలో నేషనల్ హెల్త్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ తంబురాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంగుమణి, మెడికల్ అండ్, గ్రామీణ సంక్షేమ శాఖ సంచాలకులు రాజమూర్తి, వైద్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా సమావేశానంతరం రాష్ట్రంలోని చైన్నె, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, తూత్తుకుడి, సేలం, ఈరోడ్ నగరాల్లోని ప్రభుత్వాస్పత్రుల వద్ద తుపాకీ భద్రతతో పోలీసులను బందోబస్తుకు రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment