● అధికారులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి ఆదేశాలు ● తూత్తుకుడిలో మినీ టైడల్ పార్క్ ● రూ.300 కోట్లతో ఫర్నీచర్ పార్కు ● తిరుచెందూరుకు మాస్టర్ ప్లాన్ పరిశీలన
మోటారు సైకిళ్లను పంపిణీ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్. చిత్రంలో మంత్రులు గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రుణాలను పంపిణీ చేస్తున్న ఉదయనిధి
సాక్షి, చైన్నె : పనుల వేగం పెంచాలని, నిర్ణీత సమయానికి ప్రజలకు ప్రాజెక్టులను అంకితం చేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధికారులను ఆదేశించారు. తూత్తుకుడిలో మినీ టైడల్ పార్కు, అంతర్జాతీయ ఫర్నీచర్ పార్కు, తిరుచెందూరు మాస్టర్‌ప్లాన్ అమలు ప్రాజెక్టులపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. తూత్తుకుడిలో ఉదయనిధి స్టాలిన్ పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పథకాలు, ప్రాజెక్టుల గురించి అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. వాటి అమలుకు ఆదేశించారు. తూత్తుకుడి యువతకు ఉపాధి అవకాశాల మెరుగుపరిచే దిశగా మినీ టైడల్ పార్కు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫర్నీచర్ పార్కు రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనుల వేగం పెంచాలన్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో ప్రసిద్ధి చెందిన సుబ్ర మణ్యస్వామి ఆలయంలో భక్తుల కోసం అమలు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులపై సమగ్ర చర్చతో త్వరితగతిన సేవలను భక్తులకు విస్తృతం చేయాలని సూచించారు. కాగా, ఉదయనిధి పర్యటనకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కనిమొళి దూరంగా ఉన్నారు. అయితే, ఆమె విదేశాల్లో ఉన్నారని, ఆమెతో చర్చించిన అనంతరమే తాను ఈ జిల్లా పర్యటనకు నిర్ణయించినట్టు ఉదయ నిధి వ్యాఖ్యలు చేశారు. ముందుగా తూత్తుకుడిలో ఉదయ నిధికి డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టేలా ఆహ్వానాలు పలికాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు గీతాజీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment