మదురైలో రచ్చ..రచ్చ
● స్థలం స్వాధీనానికి వ్యతిరేకంగా ఆందోళనలు ● ఏకమైన గ్రామీణులు ● రంగంలోకి బలగాలు
సాక్షి,చైన్నె: మదురై విమానాశ్రయం విస్తరణ పనులు ఆదివారం రచ్చకెక్కాయి. స్థలం స్వాధీనానికి వెళ్లిన అధికారులను గ్రామీణ ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలంతా ఏకమై అధికారులను గ్రామాలలోకి అనుమతించక పోవడంతో బలగాలు రంగంలోకి దిగాయి. వివరాలు.. మదురైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి మలేషియా, సింగపూర్ వంటి దేశాలతో పాటు దేశంలోని పలు నగరాలకు విమాన సేవలు జరుగుతున్నాయి. ఈ విమానాశ్రయం విస్తరణ గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ విమానాశ్రయం రన్‌వేతో పాటు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇటీవల స్థలాన్ని కేటాయించింది. 633 ఎకరాల స్థలంలో విస్తరణ పనులపై దృష్టి పెట్టారు. ఈ స్థలాలను స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. విమానాశ్రయం సమీపంలోని చిన్న ఉడైప్పు, ఆలంకులం, పెరుంగుడి, పరమం పట్టి గ్రామాలలో ఈ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయంలో ఇక్కడి ప్రజలకు మదురై కార్పొరేషన్ పరిధిలోనే గృహాలను నిర్మించి ఇవ్వాలన్న నినాదంతో పాటు నష్ట పరిహారం పెంపు, పంట పొలాలను స్వాధీనం చేసుకోకూడదన్న డిమాండ్‌తో గ్రామాల ప్రజలు ఆందోళనబాట పట్టారు.
ఉద్రిక్తత..
ఆదివారం రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌లు, ప్రత్యేక అధికారులు విజయలక్ష్మి, ప్రభాకరన్, శక్తి వేల్, కార్తికేయన్, సురేష్ తదితర అధికారుల నేతృత్వంలో పదుల సంఖ్యలో పోలీసులు గ్రామాలలోకి వెళ్లారు. ఈ గ్రామాల్లోకి ముందుగా చిన్న ఉడైప్పు గ్రామాన్ని దాటినానంతరం లోనికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రవేశమార్గంలోని చిన్న ఉడైప్పు గ్రామం వద్ద గ్రామీణ ప్రజలు వందలాదిగా ఏకమయ్యారు. అధికారులు స్థల స్వాధీనానికి వెళ్లేందుకు వీలు లేని రీతిలో అడ్డుకున్నారు. ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకుల మీదకు ఎక్కేశారు. గ్రామాల ప్రవేశ మార్గంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు ముందుకు సాగ లేని పరిస్థితి ఏర్పడింది. స్థల స్వాధీనంను అడ్డుకుని తీరుతామని, తమ పంట పొలాల జోలికి రావద్దు అంటూ గ్రామీణ ప్రజలు నినాదిస్తూ కూర్చున్నారు. వీరిని బుజ్జగించేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పకుండా బలగాలను రంగంలోకి దించి మొహరించారు. గ్రామీ ణ ప్రజలతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment